ఏపీ సీఎం నిర్ణయాన్ని తప్పుబట్టిన ఐవైఆర్.. జగన్ తొందర పడ్డారా?
Published on: Mon Jun 3, 2019 11:37AM

హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ మంత్రి మండలి వినతి మేరకు ఆదివారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్ దీనికి అంగీకరించారని తెలిసింది. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. శనివారం గవర్నర్ ఇఫ్తార్ విందుకు హాజరైన సమయంలో జరిగిన సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో భవనాల సమస్యను వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎంలు ఇద్దరూ నిర్ణయించారు.
కాగా, హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాలను తిరిగి తెలంగాణకు అప్పగిస్తూ ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. "ఆంధ్రప్రదేశ్ దీనిని వెంటనే ఆమోదించాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ఈ భవనాలను సచివాలయం గా కొనసాగించాలనే ఉద్దేశం తెలంగాణకు లేనప్పుడు. మిగిలిన అన్ని విభజన అంశాల పరిష్కారానికి దీనిని ముడి పెట్టాల్సింది. చాలా విభజన అంశాల లో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు విభిన్నంగా ఉన్నాయి." ఐవైఆర్ ట్వీట్ చేశారు.


