వ్యూహానికి ప్రతివ్యూహంతో ముందుకు వెళుతున్న జగన్ ప్రభుత్వం...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శాసనసభ, శాసన మండలిని ప్రొరోగ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గవర్నర్ సభలను ప్రొరోగ్ చేయటం సాధారణ ప్రక్రియ అయినా ఈసారి మాత్రం ఇలా చేయటం అధికార పార్టీకి మేలు చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

బిల్లును సభ ముందు ఉండగానే ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్బాలు రాజ్యసభలోనూ వివిధ అసెంబ్లీలోనూ ఉందంటూ ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. ట్రిపుల్ తలాక్ వంటి బిల్లులు రాజ్యసభ ముందున్నా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పార్లమెంటు ఆమోదించిన 2013 భూ సేకరణ చట్టం విషయం లోనూ సవరణల కోసం రెండు సార్లు కేంద్రం ఆర్డినెన్స్ లు జారీ చేశాయి అన్నది ప్రభుత్వ వర్గాల వాదన. 

వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ఉన్న ప్రభుత్వానికి ఉభయ సభల ప్రోరోగ్ ఉత్తర్వులతో వెసులుబాటు లభించినట్టయ్యింది. ఇప్పటి కిప్పుడు మండలి రద్దు కాదు, తనకున్న బలంతో ఎలాగైనా సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేసి జనంలోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని టిడిపి భావిస్తోంది. దీంతో వైసీపీ ప్రతివ్యూహంతో ముందుకు వెళుతోంది. సెలక్ట్ కమిటీతో సంబంధం లేకుండా ఆర్డినెన్స్ ను జారీ చేసి పని మొదలెట్టాలని యోచిస్తోంది. అందుకే సెలెక్ట్ కమిటీ ఏర్పాటును జాప్యం చేసినట్లు తెలుస్తోంది. 

ఒకసారి సెలక్ట్ కమిటీకి బిల్లును చైర్మన్ పంపించిన తరువాత అదే బిల్లుపై ఆర్డినెన్స్ ఇవ్వడం కుదరదని అంటున్నారు టీడీపీ నేతలు. ప్రభుత్వం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసినా లేకున్నా రూల్స్ ప్రకారం ఆర్డినెన్స్ ఇవ్వలేరని చెబుతోంది. సెలక్ట్ కమిటీ రూలుతో ప్రభుత్వానికి టిడిపి షాకిస్తే మండలి రద్దు తీర్మానం చేసి ఇప్పుడు ప్రొరోగ్ ద్వారా ఏకంగా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ సవరణ బిల్లులపై ఆర్డినెన్స్ కు సిద్ధమవుతోంది జగన్ ప్రభుత్వం. మండలి రద్దు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని ఈ విషయంలో కేంద్రం రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తోందని వైసిపి చెబుతోంది. టిడిపి ఎమ్మెల్యేలు స్టేజ్ షో కోసం ఢిల్లీ వెళుతున్నారని ఎద్దేవ చేస్తున్నారు. మరి ఈ ప్రొరోగ్ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.