మండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు..! కేంద్రం ఒప్పుకుంటుందా?

శాసనమండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. 50శాతం ఓట్లు, 151మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చినా, శాసనమండలిలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జగన్ సర్కారు ప్రవేశపెట్టిన బిల్లులను శాసనమండలిలో చుక్కెదురు కావడం... రెండు బిల్లులను తిప్పిపంపుతూ మండలి తీర్మానం చేయడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు... అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ల ఏర్పాటు బిల్లుల ఆమోదం మండలి కారణంగా ఆగిపోవడంతో ఏకంగా శాసన మండలినే రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బిల్లులను మండలి ఆమోదించకుండా తిప్పిపంపడంతో మరోసారి శాసససభలో ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, రెండోసారి కూడా మండలి తిరస్కరించి పంపితే అప్పుడు శాసనసభ నిర్ణయమే చెల్లుబాటు అవుతుందని తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిల్లులను మండలి ఆమోదించకుండా తిప్పిపంపడాన్ని జగన్ సర్కారు అత్యంత సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో, ఏకంగా మండలినే రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. 

58మంది సభ్యులున్న ఏపీ శాసనమండలిలో టీడీపీకి 26మంది మెంబర్స్ ఉండటంతో ప్రతిపక్షానిదే పైచేయిగా ఉంది. అధికార వైసీపీకి కేవలం 9మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దాంతో, మండలిలో అనేక విషయాల్లో ప్రతిపక్ష తెలుగుదేశానికే పైచేయిగా ఉంటుంది. శాసనసభలో వైసీపీ సభ్యులు.... టీడీపీని ఆడుకున్నట్లే.... మండలిలో అధికారపక్షాన్ని... తెలుగుదేశం వాళ్లు ఆటాడుకుంటున్నారు. దాంతో, ముఖ్యమంత్రి, మంత్రులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక, నారా లోకేష్ మండలిలో ఉండటం కూడా సీఎం జగన్ కు ఇబ్బంది మారిందనే మాట వినిపిస్తోంది. నారా లోకేష్ కు ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉండటంతో... అన్నేళ్లు మండలిలో అతడిని చూడటం జగన్ కు ఇష్టంలేదని, అందుకే రద్దు దిశగా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.

అయితే, శాసనమండలిని రద్దు చేయాలంటే లోక్ సభ, రాజ్యసభల్లో చర్చ జరిపి తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్రాన్ని ఒప్పించుకుంటే ఇది ఈజీగా జరిగిపోయే పనే. అయితే, ప్రస్తుతమున్న మోడీ ప్రభుత్వం అందుకు ఒప్పుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ కూడా శాసనమండలి రద్దు చేశారు. అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా... ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే జరిగే అవకాశముందంటున్నారు.