శ్రీవారు ఆయన ఆస్తుల్ని ఆయనే కాపాడుకుంటున్నారు

తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీటీడీ ఆస్తుల వేలానికి బ్రేకు పడింది. మొన్నటివరకు అసలు టీటీడీ ఆస్తులను అమ్మడంలో తప్పేముందని కొందరు ప్రశ్నించారు. కానీ ఒక్కరోజులో అంతా మారిపోయింది. టీటీడీ ఆస్తుల అమ్మకంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకులేదని, గత బోర్డు తీసుకున్న నిర్ణయంపై మాత్రమే బోర్డు సమావేశంలో చర్చించామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆ కాసేపటికే టీటీడీ ఆస్తుల విక్రయం నిర్ణయాన్ని నిలిపివేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది.

టీటీడీ కి చెందిన 50 ఆస్తులను విక్రయించాలని గత టీటీడీ పాలక మండలి 2016, జనవరి 30న తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ప్రస్తుత టీటీడీ పాలక మండలిని ఆదేశించింది. ఆ ఆస్తులను దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచారం తదితర అవసరాలకు ఉపయోగించుకునే అంశంపై మత పెద్దలలతో చర్చించాలని సూచించింది. అంతవరకు ఆస్తులను విక్రయించే ప్రతిపాదనను నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

టీటీడీ ఆస్తుల విక్రయానికి బ్రేకులు పడటంతో శ్రీవారి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారు ఆయన ఆస్తుల్ని ఆయనే కాపాడుకున్నారని అంటున్నారు.