బేసిన్ బయట కృష్ణా రివర్ బోర్డు! తుగ్లక్ ను మించిపోయారంటూ సెటైర్లు! 

పంజాబ్ లో ఎవరైనా  సెలూన్ షాపులు పెడతారా? థార్ ఏడారి పరిసరాల్లో విత్తనాలు విక్రయించే సాహసం చేస్తారా?  ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం నలుగురు నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా.. అలాంటి  అక్కరకు రాని పనులు కూడా చేసేలా కన్పిస్తోంది. ఏడాదిన్నరగా అస్తవ్యస్థ విధానాలు, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం పరువు తీస్తున్నారనే విమర్శలు జగన్ సర్కార్ పై ఉన్నాయి. తాజాగా కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో అది మరోసారి రుజవైందంటున్నారు. కృష్ణా బేసిన్‌కు సంబంధం లేని ప్రాంతంలో  బోర్డు ఏర్పాటు చేయడమేంటని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది కదా పాలన అంటూ నవ్వుకుంటున్నారు. తన నిర్ణయాలతో  పాలనలో  జగన్ రెడ్డి పిచ్చి తుగ్లక్ ను మించిపోయారని కొందరు సెటైర్లు వేస్తున్నారు.

నదీ జలాల పంపకాల బోర్డు ఎక్కడైనా ఆ నది బేసిన్‌లో ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో  కృష్ణా రివర్ బోర్డు ఆ బేసిన్ పరిధిలోనే ఉన్న హైదరాబాదులో  ఉండేది.  రాష్ట్ర విభజన తర్వాత ఈ బోర్డును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని పునర్విభజన చట్టంలో  పెట్టారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాదులోనే కృష్ణానది నీటి యజమాన్య బోర్డును ఉంచడానికి తెలంగాణ  సర్కార్ ప్రయత్నించింది. ఇందుకు అంగీకరించని కేంద్రం.. ఏపీలోనే బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో కర్నూలులో కేఆర్ఎంబీని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. ఇక్కడి అనుకూలతల గురించి నీటి పారుదల నిపుణులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, రాయలసీమ ఉద్యమకారులు పూర్తి వివరాలతో నివేదిక అందజేశారు.

కృష్ణా బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ ఉద్యమకారులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు కర్నూలు అందుబాటులో ఉంటుంది. గతంలో దీన్ని విజయవాడలో పెట్టాలనే ఆలోచన చేసినప్పుడే తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కృష్ణానది సముద్రంలో కలిసే చోట యాజమాన్య బోర్డు పెట్టడం అర్థరహితం అన్నారు. కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేస్తే నీటి వినియోగంలో, కేటాయింపుల్లో తరచూ వచ్చే వివాదాలను పరిష్కరించుకోడానికి అనుకూలంగా ఉంటుందని మూడు రాష్ట్రాల నీటి పారుదల శాఖ నిపుణుల అభిప్రాయం.  కర్నూలు సరిహద్దుల్లోనే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉండడం వల్ల త్వరలోనే తుంగభద్ర బోర్డును రద్దు చేసి కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డులో కలిపేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చన్న వాదన కూడా ఉంది.  

కృష్ణా జలాల పంపిణీలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయడం న్యాయమనే అభిప్రాయం కూడా ఉంది. ప్రాంతీయ సమానత్వానికి కృషి చేయాలనే సదుద్దేశానికి ఊతం ఇస్తుందని అనేక మంది అభిప్రాయపడుతూ వచ్చారు. దీంతో రాయలసీమ ప్రాంతానికి చెందిన వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉండటం, ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు కూడా దీన్ని బలపరచడంతో..  కర్నూల్ లో కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటుకు ఎలాంటి ఆటంకాలు ఉండవని అంతా భావించారు. కాని అందుకు భిన్నంగా ఇప్పుడు ఏకంగా కృష్ణా బేసిన్‌కు సంబంధం లేని విశాఖపట్టణంలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ఇది కేవలం వైజాగ్‌లో రాజధాని ఏర్పాటు చేయాలనే వ్యూహానికి అనుకూలంగానే  జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  

       ప్రస్తుతం గ్రేటర్ రాయలసీమ  డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. కర్నూల్ ను రాజధాని చేయాలనే డిమాండ్ అలాగే ఉంది. ఇలాంటి తరుణంలో  అన్ని అనుకూలంగా ఉన్న కర్నూల్ కాకుండా.. కృష్ణా బేసిన్ కు ఏమాత్రం సంబంధం లేని విశాఖలో కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయలని నిర్ణయం తీసుకోవడం అందరిని విస్మయ పరుస్తోంది. కొత్త వివాదాన్ని రగిలించేందుకే జగన్ సర్కార్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందా అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. కృష్ణా బోర్డును తన రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం జగన్ వైజాగ్‌ తీసికెళ్లాలని చూస్తున్నారని రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతానికి సంబంధం లేని విశాఖ పట్టణంలో ఈ బోర్డును ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.  కృష్ణానది యాజమాన్యం బోర్డును రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఆర్‌వీఎస్‌, ఆర్‌వైపీఎస్‌, ఆర్‌వీపీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.