నిమ్మగడ్డ నిర్ణయమే కరెక్ట్! అంగీకరించిన ఏపీ సర్కార్! రచ్చ సంగతేంటో? 

కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనని తేలింది. జగన్ ప్రభుత్వంమే దీన్ని అంగీకరించింది. ఈ మేరకు ఏకంగా హైకోర్టులోనే అఫడవిట్ దాఖలు చేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ.. తాండవ యోగేష్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమని ఏపీ ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. కరోనా కాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని హైకోర్టుకు తెలిపింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం‌ అభిప్రాయం తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను నవంబరు 2కి వాయిదా వేసింది. 

 

స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ సర్కార్ తాజా వైఖరితో మార్చిలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని రుజవైంది. అయితే కరోనా ప్రభావం ఉన్నా స్థానిక ఎన్నికలు జరపాలని పట్టుబట్టిన జగన్ సర్కార్.. ఇప్పుడు మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రభుత్వ స్పందన రాజకీయ, న్యాయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

 

కరోనా విజృంభిస్తున్న మొదటి రోజుల్లో.. దేశం మొత్తం లాక్ డౌన్ విధించేసినా స్థానిక ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని పట్టుబట్టింది వైసీపీ సర్కార్. ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఫైరయ్యారు సీఎం జగన్. మంత్రులు, వైసీపీ నేతలైతే ఆయన్ను దారణంగా టార్గెట్ చేశారు. ఎన్నికల కమిషనర్ గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డను వ్యక్తిగతంగా దూషించారు. ఎస్‌ఈసీని కూడా తొలగించి రచ్చ రచ్చ చేసింది ప్రభుత్వం. అయితే హైకోర్టు జోక్యంతో నిమ్మగడ్డ తన పదవిలో కొనసాగుతున్నారు. స్థానికల ఎన్నికల వ్యవహారం ఏపీలో అప్పట్లో పెద్ద  సంచలనమే అయింది. టీడీపీ, వైసీపీ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. 

 

ప్రస్తుతం దేశం కరోనా భయం నుంచి బయటపడుతోంది. ఏపీలో కూడా లాక్ డౌన్ ఎత్తేశారు. బీహార్ సహా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ అంశాలను పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నికలు ఇప్పుడు సాధ్యం కాదని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత కాలం నిర్వహించకూడదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే మార్చి వరకూ.. ఎస్‌ఈసీ పదవీ కాలం ఉంది. అందుకే ఇప్పుడు సాధ్యం కాదని హైకోర్టుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయమే ఫైనల్. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో.. అన్నదానిపైనే…స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉండే అవకాశం ఉంది. ఆయన ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనా.. ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారుతోంది. 

 

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను మార్చిలో నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. అయితే దేశంలో కరోనా కేసులు నమోదు కావడంతో అంతటా భయాందోళన నెలకొంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మార్చి 15న ప్రకటన చేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే.. చాలా మందికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని చెప్పారు. నిమ్మగడ్డ తీసుకున్న ఆ నిర్ణయాన్ని అప్పుడు ప్రభుత్వం తప్పుపట్టింది. ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు కొత్త చట్టమే తెచ్చింది. కొత్త ఎన్నికల కమిషనర్ ను కూడా హడావుడిగా నియమించింది. అయితే ప్రభుత్వ చర్యలపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంపై నానా రభస చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు ఆయన చెప్పిన మాటనే హైకోర్టుకు చెప్పడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.