ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం... సీడ్ క్యాపిటల్ నిర్మాణ ఒప్పందం రద్దు

 

ఏపీ రాజధాని అమరావతిలో అంతులేని అవినీతి దాగి ఉందని చెబుతూ వస్తున్న వైసీపీ ప్రభుత్వం సీడ్ క్యాపిటల్ నిర్మాణం ఒప్పందాన్ని రద్దు చేసింది. రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను సింగపూర్ సంస్థలకు గత ప్రభుత్వం అప్పగించింది .ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఖర్చు కానుండగా సింగపూర్ సంస్థ భారీగా లాభపడుతుందని కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ చెప్తోంది. 

సింగపూర్ కంపెనీల కన్సార్టియంతో చర్చలు జరిపిన ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్ట్ గా ఎంతో ప్రచారం పొందిన సీడ్ క్యాపిటల్ ఒప్పందంపై రాష్ట్ర మంత్రులు ,అధికారులు సింగపూర్ కన్సార్టియంతో ఈ నెల ఇరవై ఒకటిన చర్చలు జరిపారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పరస్పర అంగీకారంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి సింగపూర్ కంపెనీ అంగీకరించింది. దీని పై మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

రాజధానిలో స్టార్టప్ ఏరియా ను అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం భావించింది ఇందుకోసం 2017 మే 15న సింగపూర్ సంస్థల కన్సార్టియంతో ఒప్పందం చేసుకుంది  1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలన్నది ప్లాన్. వీటిలో నూట డెబ్బై ఎకరాలు నదీ తీరంలో ఉన్నాయి. ఇందులో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత సీఆర్డీఏది. అందుకోసం సిఆర్డిఏ రెండు వేల నూట పధ్ధెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అసెండాస్, సింగ్ బ్రిడ్జ్ ,సెంబ్ కార్ప్ సంస్థలతో కన్సార్టియం ఏర్పడింది. సింగపూర్ సంస్థలే కన్సార్టియం అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది, స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మాస్టర్ డెవలపర్ ను ఎంపిక చేసింది గత ప్రభుత్వం అమరావతి డెవలప్ మెంట్ పార్టనర్ ఏడీపీ పేరుతో ఎస్పీవీని ఏర్పాటు చేసింది.ఎస్పివిలో కన్సార్టియమ్ కి యాభై ఎనిమిది శాతం వాటా ఉంటుంది. దీని కింద మూడు వందల ఆరు కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, ఎస్పివిలో ఏడీసీకి నలభై రెండు శాతం వాటా ఉండగా దాని కింద రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ కన్సార్టియం డెబ్బై ఎనిమిది కోట్లు ఏడీసీ యాభై రెండు కోట్లు పెట్టుబడిని జమ చేశాయి. మరోవైపు నదీ తీరంలో అభివృద్ధి పనులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబందనలు ఇబ్బందిగా మారడంతో పనులు మొదలు కాలేదు.