రిక్షావోడులో చిరంజీవిలా మారనున్న గ్రామ వాలంటీర్లు!!

 

అప్పట్లో పెద్దవాళ్ళు పిల్లలతో.. బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకోండిరా, లేకపోతే కష్టపడి రిక్షా తొక్కి బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏపీలో చదువుకొని, చిన్న ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు సైతం రిక్షా తొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనంతటికీ కారణం గ్రామ వాలంటీర్ల వ్యవస్థ.

వైసీపీ అధినేత వైఎస్ జగన్  ఏపీ సీఎంగా భాధ్యతలు చేపట్టిన రోజునే గ్రామ వాలంటీర్లు అనే పేరు చెప్పి ఆగష్టు 15 లోపు నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఘనంగా ప్రకటించారు. 5 వేల రూపాయల జీతంతో నియమిస్తున్నానని తెలిపారు. సరే 'గుడ్డి కన్నా మెల్ల మేలు' అన్నట్టుగా.. పేరుకి పెద్ద పెద్ద చదువులే కానీ, పెద్ద ఉద్యోగాలు ఎలాగూ రావు. సరే ఈ ఉద్యోగమైతే ఊర్లో ఉంటూ హ్యాపీగా చేస్కోవచ్చు అని.. గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు యువత బాగానే పోటీ పడ్డారు. తీరా ఎంపికయ్యాక ఒక్కో ట్విస్ట్ తెలుసుకుంటూ షాక్ అవుతున్నారు.

ఉద్యోగం ఒక సంవత్సరమే ఉంటుందని, తరువాత కొనసాగించాలా లేదా అని మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందని మొదటి షాక్ తగిలింది. అంతేనా.. ప్రతి వాలంటీర్ కు ఒక స్మార్ట్ ఫోన్, దానికోసం జీతంలో నుంచి 500 కట్ అంటూ ఇంకో షాక్. వచ్చేదే 5 వేలు, మళ్ళీ దానిలో 500 కట్టా అంటూ యువత తెల్ల మొహాలు వేశారు. అయితే తాజా షాక్ తో ఆ తెల్ల మొహాలు కాస్తా మాడి పోయాయి. ఇంతకీ ఆ షాక్ ఏంటంటే.. వాలంటీర్లు రిక్షావోడులో చిరంజీవిలా మారి రిక్షా తొక్కాలంటా. వాలంటీర్లకు ప్రత్యేకంగా సరుకులు పట్టుకెళ్లేందుకు రిక్షాలను కూడా అందజేస్తున్నారు.

అంత చదువు చదివి ఇలా ఊళ్ళో రిక్షా తొక్కుకుంటూ ఇంటింటికి వెళ్లాలా అంటూ వాలంటీర్లుగా ఎంపికైన యువత తెగ ఇబ్బంది పడిపోతున్నారట. కొందరైతే అసలు వాలంటీర్లుగా పనిచేయాలా లేక వెనుకడుగు వేయాలా అని కూడా ఆలోచిస్తున్నారట. మరి ప్రభుత్వం చదువుకున్న యువతను దృష్టిలో పెట్టుకొని రిక్షా కాన్సెప్ట్ ని పక్కన పెడతారేమో చూడాలి.