భారతీ సిమెంట్స్ కే సర్కార్ బల్క్ ఆర్డర్లు! ఖజానా దోచేస్తున్న జగన్ ఫ్యామిలీ?  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సిమెంట్ కంపెనీ లాభార్జనలో దూసుకుపోతోంది... కాదు కాదు సర్కార్ ఖజానాను అప్పనంగా  దోచేస్తూ ఆదాయం పెంచుకుంటోంది. ఇదో ఎవరో విపక్ష నేతలు చేస్తున్న  ఆరోపణ కాదు. స్వయానా ఏపీ సర్కార్ చెబుతున్న లెక్కలు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో  ప్రభుత్వ పనుల కోసం... జగన్ రెడ్డి సర్కార్ అధికారికంగా కొనుగోలు చేసిన సిమెంట్ ఆర్డర్లలో మెజార్టీ వాటా భారతీ సిమెంట్స్ కే దక్కింది. 2020 ఏప్రిల్ నుంచి జనవరి 18 వరకు 2021 వరకు.. 10 నెలల కాలంలో 2,28,370.14 మెట్రిక్ టన్నుల సిమెంటు కోసం భారతీ సిమెంట్స్ కు ఆర్డర్లు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. 

ఏపీ  సర్కార్ ఆర్డర్లను బల్క్ గా  కొట్టేసిన ఈ భారతీ సిమెంట్స్ సంస్థ ఎవరిదో  తెలుగు ప్రజలందరికి తెలుసు. భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుటుంబానికి 49 శాతం వాటా ఉంది. సీఎం జగన్ రెడ్డి భార్య భారతీనే ఆ సంస్థ  డైరెక్టర్. వికాట్ అనే ఫ్రెంచ్ సంస్థ 2010 లో భారతి సిమెంట్‌లో 51 శాతం వాటాను సొంతం చేసుకుంది.  అంటే సీఎం జగన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న  భారతీ సిమెంట్ కు..  బల్క్ ఆర్డర్లు ఇస్తూ  ప్రజా ధనాన్ని దోచి పెడుతోంది  ఏపీ సర్కార్. బహిరంగ మార్కెట్ లో సిమెంట్ రేటు పెరిగేలా సిండికేట్ నడిపి.. తర్వాత ప్రభుత్వ పనులకు సామాజిక బాధ్యత కింద తక్కువ రేటుకే సరఫరా చేస్తున్నామనే కవరింగ్ ఇస్తూ.. ఈ నయా సిమెంట్ దోపిడికి జగన్ ఫ్యామిలీ  తెర తీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. 
  

భారతీ సిమెంట్స్ తర్వాత  ఏపీ ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆర్డర్లు పొందింది ఇండియా సిమెంట్స్ లిమిటెడ్.  గత 10 నెలల కాలంలో  1,59,753.70 మెట్రిక్ టన్నుల ఆర్డర్ పొందింది ఈ సంస్థ. 
ఇది భారతి సిమెంట్స్ కంటే 30 శాతం తక్కువ. అయితే ఈ ఇండియా సిమెంట్స్ ఎవరిదో కాదు. వైఎస్ జగన్ మరియు ఇతరులపై సిబిఐ నమోదు చేసిన  క్విడ్ ప్రో కో కేసులో ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్ ఒకరు. అంతేకాదు భారతి సిమెంటులో రూ .95.32 కోట్ల పెట్టుబడులు కూడా పెట్టింది ఇండియా సిమెంట్స్.  ఏపీ సర్కార్ నుంచి ఆర్డర్లు ఎక్కువగా పొందిన మూడో సంస్థ పెన్నా సిమెంట్స్‌.  ఏపీ ప్రభుత్వం నుంచి 1,50,325.02 మెట్రిక్ టన్నుల కొనుగోలు ఆర్డర్లు పెన్నా సిమెంట్స్ కు గత 10 నెలల కాలంలో వచ్చాయి. పెన్నా సిమెంట్స్ ఓనర్ కూడా జగన్ పై నమోదైన సీబీఐ క్విడ్ ప్రో కేసులో నిందితుడే.  మొత్తంగా జగన్ కుటుంబానికి చెందిన , ఆయన సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల సంస్థలకే  ఏప్రిల్ 2020 నుంచి  జనవరి 2021 మధ్య మొత్తం ఏపీ ప్రభుత్వ కొనుగోలు ఆర్డర్‌లలో మూడవ వంతు వాటా దక్కింది. 

ఏప్రిల్ 2012 మరియు సెప్టెంబర్ 2014 మధ్య సిబిఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో... 6, 7, 8 చార్జిషీట్లలో  డాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, రఘురామ్ సిమెంట్స్ (భారతి సిమెంట్ యొక్క పూర్వపు పేరు) మరియు పెన్నా సిమెంట్స్ క్విడ్ ప్రో కోకు సంబంధించినవి.  వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కొన్ని కంపెనీల వైపు మొగ్గు చూపిందని, తక్కువ ధరలకు భూమిని కేటాయించిందని, మైనింగ్ లీజులు ఇవ్వడానికి చట్టాలను అధిగమించిందని లేదా నిబంధనలకు విరుద్ధంగా అదనపు నది నీటిని కేటాయించిందని సిబిఐ ఆరోపించింది, దీనికి బదులుగా వారు జగన్ రెడ్డి యాజమాన్యంలోని సంస్థలలో పెట్టుబడులు పెట్టారని తెలిపింది. అప్పడు వైఎస్సార్ హయాంలో క్విడ్ ప్రోకోలో లాభపడ్డారనే కేసులు ఎదుర్కొంటున్న  శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ సంస్థలే..  ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం నుంచి సిమెంట్ ఆర్డర్లు భారీగా పొందాయన్న మాట.  
 
ఏపీ ప్రభుత్వ అధికారిక లెక్కలతో .. వైఎస్ హయాంలో వెలుగులోనికి వచ్చిన క్విడ్ ప్రోకో అక్రమ దందాకు  మించిన దోపిడి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో  జరుగుతుందని తేలుతోంది. భారతి సిమెంట్ నేతృత్వంలోని సిమెంట్ కంపెనీలు సిండికేట్ ఏర్పాటు చేశాయని టీడీపీ ఆరోపిస్తోంది. అందుకే గత కొన్ని నెలల్లో 50 కిలోల సంచికి 220-250 రూపాయల నుండి 350-400 రూపాయలకు పెంచారని చెబుతోంది.  భారతి సిమెంటుకు ప్రయోజనం చేకూర్చడానికి ఇది జరిగిందంటున్నారు టీడీపీ నేతలు. బహిరంగ మార్కెట్లో సిమెంట్ ధరల పెరుగుతున్నా జగన్ సర్కార్ పట్టించుకోలేదని..  సర్కార్ కు తక్కువ రేటుకు ఇస్తున్నారనే సాకుతో భారతీ సిమెంట్స్ కు ఆర్డర్లు ఇవ్వొచ్చని కుట్ర చేశారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభీ ఆరోపించారు. సర్కార్ ఖజానాను సీఎం సొంత సంస్థ కొట్టేస్తుండగా.. సామాన్య జనాలు మాత్రం బహిరంగ మార్కెట్ లో ఎక్కువ రేటుకు సిమెంట్ కొనుగోలు చేస్తూ భారం మోస్తున్నారని ఆయన మండిపడ్డారు.   

జగన్ సంస్థతో పాటు అతనితో సంబంధాలున్న సంస్థలకే ప్రభుత్వ సిమెంట్ ఆర్డర్లు ఇచ్చారన్న ఆరోపణలపై స్పందించిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి... ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు.  భారతి, ఇండియా, పెన్నా  సిమెంట్స్  సంస్థలు..  తక్కువ  రేటుకే షెడ్యూల్ ప్రకారం సరఫరా చేయగలిగినందుననే వారికి సర్కార్ నుంచి ఎక్కువ  ఆర్డర్లు వచ్చాయన్నారు. ఇతర కంపెనీలకు సమస్యలున్నాయని, షెడ్యూల్ ప్రకారం సరఫరా చేయలేకపోయాయని చెప్పారు.   వైఎస్ఆర్ నిర్మాన్ అనే పోర్టల్ ద్వారా కొనుగోలు ఆర్డర్లు చేస్తామని తెలిపారు.  అన్ని ప్రభుత్వ విభాగాలు తమ అవసరాలను జిల్లా కలెక్టర్లకు పంపుతాయని,  అప్పుడు వైయస్ఆర్ నిర్మాన్ ద్వారా ఏపి సిమెంట్ తయారీదారుల సంఘం (ఎపిసిఎంఎ) కు ఆర్డర్లు ఇస్తారని చెప్పారు.  APCMA దాని 23 తయారీదారులలో ఆర్డర్లను పంపిణీ చేస్తుందన్నారు. ఇదంతా పారదర్శకంగా జరుగుతుందంటున్నారు గౌతం రెడ్డి.