ప్లాస్మా దాతలకు 5వేల రూపాయలు ప్రోత్సాహకం

కరోనా చికిత్స కోసం గుర్తించిన ఆసుపత్రుల్లో బెడ్ల ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ప్‌ డెస్క్‌లో అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ఎవరికైనా బెడ్‌ అందుబాటులో లేకపోతే.. వారిని సమీప ఆస్పత్రికి పంపించి అక్కడ బెడ్‌ అలాట్‌ చేయాలని తెలిపారు. 

కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ కోసం నిర్దేశించిన 138 ఆసుపత్రుల మేనేజ్‌మెంట్‌ పై దృష్టి పెట్టాలని చెప్పారు. బెడ్లు, వైద్యం, ఆహారం, శానిటేషన్‌ పై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. 

ప్లాస్మా థెరపీపై కూడా బాగా అవగాహన కల్పించాలి, దీనివల్ల మంచి ఫలితాలుంటే ప్రోత్సహించాలని సూచించారు. ప్లాస్మా ఇచ్చే వారికి 5వేల రూపాయలు ప్రోత్సాహకం ఇవ్వాలని జగన్‌ ఆదేశించారు. మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని సీఎం జగన్ అన్నారు‌.

సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు. విద్యాకానుకతో పాటు పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలని, దీని కోసం వెంటనే మాస్కులు సిద్ధం చేయండని ఆదేశించారు.