వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ నిజమే!!

 

వైసీపీ నేతలకు చెందిన ఫోన్లను అధికారులు ట్యాప్‌ చేశారంటూ దాఖలైన పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కారును హైకోర్టు ఆదేశించింది. టెలిగ్రాఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 5(2)ని అనుసరించారా? లేదా? తదితర అంశాలపై రాతపూర్వక స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. విచారణను జూన్‌ 6కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

తన ఫోన్ తో పాటు తమ పార్టీకి చెందిన నేతల ఫోన్లను పోలీసు అధికారులు ట్యాప్‌ చేశారంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన విచారణలో ఏయే సందర్భాల్లో ట్యాపింగ్‌ చేయవచ్చన్న అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు గురించి ధర్మాసనం ప్రస్తావించింది. అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ చేసిన‌ట్లు అంగీకరించారు. అయితే ట్యాపింగ్‌ వ్యవహారంలో టెలిగ్రాఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 5(2)ని అనుసరించామన్నారు.