TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేంద్ర పథకాలకూ పంగనామం? జగనన్న మరో దురాలోచన!

Published on: Wed Mar 2, 2022 10:24AM

‘పనిచేయడం చేసే చేవ లేనోడు ఊరంతా తప్పే అన్నాడట’ అలా ఉంది ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ తీరు. తన చేతకానితనంతో రాష్ట్రాన్ని అన్ని విధాల దివాళా తీయించిన జగన్ సర్కార్ ప్రజలకు పథకాలను ఎలా దూరం చేయాలా? అనే ఆలోచన చేస్తోందట. తాము ప్రకటించిన నవరత్నాలను అమలు చేయడమే తలకు మించిన భారం అయిన నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే పథకాలకు తన వాటా నిధులు సమకూర్చలే అసహాయ స్థితితో కూరుకుపోయిందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. అందుకు ఏకంగా కేంద్రం పథకాలనే ఎత్తిపారేయాలనే దురాలోచనలో ఉందని తెలుస్తోంది.

నిజానికి ఏపీ సర్కార్ కేవలం అప్పుల మీద అప్పులు చేసి రోజులు నెట్టుకొస్తోంది. అప్పులు చేయడమే కానీ రాష్ట్రంలో ఏ మూలనా ఏ కాస్త అభివృద్ధీ జరగని దుస్థితి నెలకొంది. అయినప్పటికీ తన వాటా నిధులు ఇవ్వలేక ఏకంగా ఏపీకి, ఏపీ ప్రజలకు మేలు చేసే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను వదిలిపెట్టేసేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తూ కాలం వెళ్లబుచ్చిందంటున్నారు. ఇప్పుడు ఇక అలా కేంద్రం నిధులను మళ్లించే ఛాన్స్ ఏమాత్రం లేని పరిస్థితి వచ్చిందట. అందుకే కేంద్రం నుంచి వచ్చే 15 వేల కోట్ల రూపాయలను నిస్సహాయంగా వదిలిపెట్టేస్తోందట.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం వివిధ పథకాల కింద ఏటా 20 వేల కోట్లు గ్రాంటుగా ఇస్తోంది. దానిని ఏపీ సర్కార్ మ్యాచింగ్ గ్రాంటు వాటాగా 12 వేల కోట్లు ఖర్చు చేసి, ఆయా పథకాలను అమలు చేయాలి. అయితే.. నిధుల మళ్లింపునకే అలవాటుపడిన వైసీపీ సర్కార్ మ్యాచింగ్ గ్రాంటు నిధులు రిలీజ్ చేయడం లేదు. ఈ విషయంలో కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కేంద్రం కొన్ని కఠిన షరతులు పెట్టింది. ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలని, లాగిన్ వివరాలు తమకూ అందజేయాలని కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఏపీ సర్కార్ తన మ్యాచింగ్ గ్రాంటును కూడా అదే ఖాతాలో జమచేసి.. ఆ పథకాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశంతో జగన్ రెడ్డి సర్కార్ బుర్ర తిరిగిపోయింది.

ఈ నేపథ్యంలో అప్పుల కోసం రకరకాల గిమ్మిక్కులు చేసినట్లే మ్యాచింగ్ గ్రాంటు విషయంలోనూ మాయలు చేయాలని భావించిందట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా తెరిచి, అందులో కేంద్రం వాటి నిధులు జమచేస్తామని, రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంటును ఓడీ రూపంలో అప్పుగా బ్యాంకే సమకూర్చాలని కోరింది. అందుకు ఎస్బీఐ ససేమిరా అంది. ఆపైన జగన్ సర్కార్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించింది. అది కూడా ఓడి ప్రతిపాదనను అంగీకరించలేదు. అయినప్పటికీ 130 కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కోసం 130 సింగిల్ నోడల్ ఏజెన్సీ బ్యాంకు ఖాతాలు మాత్రం తెరిచింది. విజయవాడ రింగురోడ్డు యూనియన్ బ్యాంకు బ్రాంచిలో గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఖాతాలు అందుబాటులోకి వచ్చాయి. తన పథకాలకు కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా.. రాష్ట్ర మాత్రం ఆ బ్యాంకు ఖాతాల్లో తన వాటా నిధులు జమచేయడంలేదు. ఈ ఖాతాల లాగిన్ లు కేంద్రం వద్ద ఉన్నాయి. బ్యాంకులో నిధులు జమ అవుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు కేంద్ర అధికారులు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు.. రాష్ట్రం వాటి నిధులు ఖాతాల్లో జమ చేస్తారా? లేదా? అని కేంద్ర అధికారులు జగన్ సర్కార్ పీకల మీద కూర్చున్నారట.

దీంతో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక కేంద్రం పథకాలనే వదిలిపెట్టేసేందుకు ఏపీ సర్కార్ రెడీ అయిందట. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యంగా భావించి, అమలు చేస్తున్న పథకాలతో సరిపోలే పథకాలకు మాత్రమే మ్యాచింగ్ గ్రాంటు నిధులు ఇవ్వాలని నిర్ణయించుకుందట. మిగిలిన పథకాలకు తిలోదకాలు ఇచ్చేయాలని డిసైడ్ అయిందని విశ్వసనీయ సమాచారం. అంటే ఏపీ సర్కార్ అమలు చేయాలనుకున్న పథకాలకు కేవలం 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే అందుతాయట. దరిమిలా 15 వేల కోట్ల కేంద్రం నిధులను జగన్ సర్కార్ చేతకానితనంతో వదిలేసినట్టే అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏయే ప్రముఖ పథకాలతో కేంద్ర ప్రభుత్వ పథకాలు సరిపోలుతున్నాయో శుక్రవారానికల్లా నివేదిక ఇవ్వాలని ఆర్థికశాఖ ఆదేశించడం ఇందుకు నిదర్శనం. అంతే కాకుండా ఇకపై కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఢిల్లీకి ప్రతిపాదనలు పంపకూడదని స్పష్టం చేసిందట.