ఎలక్ట్రిక్ బస్సులకు నిధులు లేవు.. డీజిల్‌వే నడుపుకోండి... ఏపీఎస్ఆర్టీసీకి జగన్ పిలుపు

ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు పై ఏపీ సర్కారు వెనుకడుగు వేస్తుంది. డీసిల్ బస్సుల నిర్వహణ ఖర్చుల కంటే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఖర్చులే ఎక్కువ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాంటప్పుడు ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు ఎందుకు ఆహ్వానించి రద్దు చేశారనేది ప్రశ్నగా మారింది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుపై ఏపీఎస్సార్టీసీ వెనకడుగు వేసింది. కొనుగోలు చేయాలంటే కోట్లల్లో ధర.. డీజిల్ బస్సులతో పోల్చితే నిర్వహణ వ్యయం ఎక్కువ. అలాంటప్పుడు కొనుగోలుకన్నా వదులుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అద్దెకు తీసుకుందామని అనుకున్నా.. డీజిల్ బస్సులతో పోల్చితే ఎలక్ట్రిక్ బస్సుల అద్దె ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు తాత్కాలికంగా ఆపేసింది. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసే రవాణా సంస్థలకు.. ప్రైవేటు వ్యక్తులకు భారీ సబ్సిడీ ప్రకటించింది. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ 1000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని భావించింది. 

మొదటి విడతలో భాగంగా 350 బస్సులు కొనాలనుకుంటే బస్సుల తయారీ కంపెనీల ప్రతినిధులతో ఆగస్టులో ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఒక్కో బస్సు ధర రూ.కోటి 80 లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఉంటుందని కంపెనీలు పేర్కొన్నాయి. ఇది ఎంతో భారమని భావించిన ఉన్నతాధికారులు ప్రైవేటు కంపెనీల నుంచి అద్దెకు తీసుకోవాలనుకున్నారు. కర్ణాటక , తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బస్సులను అద్దె కిచ్చిన సంస్థలను ప్రీపెయిడ్ కు ఆహ్వానించి చర్చలు జరిపారు.కిలో మీటరుకు రూ.60 రూపాయల వరకు ఇవ్వాలని కొన్ని కంపెనీలు అంతకు ముందే చెప్పడంతో అందుకు అప్పటి ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు ససేమిరా అన్నారు. తాము బస్సు నడిపితే కిలోమీటరుకు వచ్చే ఆదాయమే రూ.32 రూపాయలకు మించదని.. అలాంటప్పుడు రూ.60 రూపాయలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. 

ప్రీ బిడ్ సమావేశానికి ముందు రోజు ప్రభుత్వం ఆయనను బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇంచార్జి ఎండీగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబును నియమించింది. దీని పై ఆర్టీసీలో ఎలక్ట్రిక్ షాక్ అనే శీర్షికతో సెప్టెంబర్ 25 న ఒక కథనం ప్రచురించింది. దీనిని ప్రభుత్వం ఖండించింది. అనంతరం అద్దె ప్రాతిపదికన 1350 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్ లు పిలిచింది. ఈ నెల 4వ తేదీ వరకు గడువు విధించింది. అయితే రాష్ట్రంలో వంద కోట్ల రూపాయల దాటిన పెద్ద టెండర్లన్నీ జుడిషియరీ కమిషన్ కు పంపి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టెండర్ లను 4వ తేదీనే రద్దు చేశారు. ఈ నెల ( నవంబర్ ) 15 లోపు మళ్లీ టెండర్ లు పిలుస్తామని అధికారులు చెప్పిన అలాంటిదేమీ జరగలేదు. ఎలక్ట్రిక్ బస్సులు కొనడమో అద్దెకు తీసుకోవడమో చేసే కంటే డీజిల్ బస్సులు కొనడం మేలని రవాణామంత్రి పేర్ని వెంకట్రామయ్య ప్రతిపాదించినట్లు తెలిసింది. 4వ తేదీన టెండర్ లు రద్దు చేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఎలక్ట్రిక్ బస్సులు అంశంపై సమీక్షించారు. ఈ బస్సుల ధర కోట్లల్లో ఉండటం.. నిర్వహణ డీజిల్ కన్నా భారంగానే ఉండటం.. రీచార్జి స్టేషన్ ల ఏర్పాటుకు రూ.200 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఉన్నతాధికారులు చెప్పడంతో కొనుగోళ్లు వద్దని సీఎం అన్నట్లు తెలిసింది.

అద్దెకు తీసుకున్న భారమేనని చెప్పడంతో మరింత లోతుగా అధ్యయనం చేయాలని జగన్ ఆదేశించినట్టు తెలిసింది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు పై ప్రభుత్వం ప్రస్తుతానికి ఆసక్తిగా లేదని మంత్రి మంగళవారం ( నవంబర్ 19న) తెలిపారు. జ్యుడీషియల్ కమిషన్ కు పంపిన తరవాతే తక్కువకు ఎవరూ ముందుకు వస్తారో వాళ్లకు అవకాశమిస్తామని తెలిపారు.ఈ నెల 23 లోపు ముఖ్యమంత్రితో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఎంతో భేటీ తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు ఇన్ చార్జ్ ఎంటీ కృష్ణబాబు.