వీర జవాన్లకు సాయంలోనూ కులం! ఏపీ సర్కార్ మరో దారుణం

ఆంధ్రప్రదేశ్ లో దేశంలో ఎక్కడా లేనంటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ పాలనలో వింత వింత ఘటనలు జరుగుతున్నాయి.  వీర జవాన్ల కుటుంబాలకు చేసే సాయంలోనూ వివక్ష చూపుతున్నారు పాలకులు. కులం ఆధారంగా అమర జవాన్ల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అమరులైన జవాన్లలో కొందరి కుటుంబాలకు సాయం చేస్తూ.. మరికొందరిని పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలు తావిస్తోంది. జగన్ సర్కార్ తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమర జవాన్లను కూడా అవమానించడమేంటనీ ఫైరవుతున్నారు ప్రజలు. ఇలాంటి పరిస్థితులు ఏపీలో రావడం దారుణమని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
              
మూడు రోజుల క్రితం కాశ్మీర్‌ లో  జరిగిన ఉగ్ర దాడులో చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి అమరుడయ్యారు. బుధవారం అమర జవాన్ అంత్యక్రియలు
అధికార లాంఛనాలతో  పూర్తయ్యాయి. దేశం కోసం వీర మరణం పొందిన ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది జగన్ సర్కార్. అయితే అక్టోబర్ 12న సరిహద్దులో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ లో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు గ్రామానికి చెందిన జవాన్ బొంగు బాబూరావు వీరమరణం పొందాడు. అస్సాం రైఫిల్స్‌లో సైనికుడిగా ఉన్న 
బాబూరావు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయారు. అంతకు నెల క్రితం శ్రీకాకుళం నగరానికి చెందిన ఉమామహేశ్వరరావు బాంబు నిర్వీర్యం చేస్తుండగా పేలిన 
ఘటనలో మృతి చెందారు. సిక్కోలుకు చెందిన ఈ ఇద్దరూ జవాన్లు విధినిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయినా.. జగన్ సర్కార్ మాత్రం వారి కుటుంబాలను పట్టించుకోలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ప్రకటించలేదు.  

అమర జవాన్ల విషయంలో  జగన్ సర్కార్ వ్యవహరించిన తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు  50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించిన జగన్ సర్కార్.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు వీర జవాన్ల కుటుంబాలను పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. అమర జవాన్ల విషయంలోనూ కులం చూసి పరిహారం ఇస్తున్నట్లుగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వీర జవాన్లకు సాయంలోనూ కులం చూస్తారా  అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సీఎం జగన్ కు లేఖ రాశారు. "ఉగ్రవాదులతో పోరాడుతూ మరణించిన చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల సాయం ఇచ్చారు. అభినందిస్తున్నాను. దీనికి కొద్ది రోజుల ముందు ఈ నెల 4న అస్సాం రైఫిల్స్‌ దళంలో హవల్దార్‌గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లా వజ్ర కొత్తూరుకు చెందిన బొంగు బాబూరావు వీర మరణం పొందారు. సైన్యంలో పనిచేస్తున్న వారి ప్రాణత్యాగం ఎవరిదైనా ఒకటే. ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబానికి ఎటువంటి సాయం ఇచ్చారో అదే సాయాన్ని కులం, మతం, ప్రాంతం చూడకుండా ఇతర అమర వీరుల కుటుంబాలకు కూడా ఇవ్వాలి. బాబూరావు కుటుంబానికి కూడా ఈ సాయం వర్తింపచేయాలి" అని లేఖలో ముఖ్యమంత్రిని కోరారు అచ్చెం నాయుడు. 

దేశం కోసం ప్రాణాలు అర్పించిన సిక్కోలుకు చెందిన వీర జవాన్ల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. వీర జవాను ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించడం స్వాగతించదగ్గ విషయమన్నారు రామ్మోహన్‌ నాయుడు. రెండు నెలల వ్యవధిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందారని ఆయన గుర్తుచేశారు. శ్రీకాకుళం నగరానికి చెందిన ఉమామహేశ్వరరావు బాంబు నిర్వీర్యం చేస్తుండగా పేలిన ఘటనలో మృతి చెందగా, అస్సాం రైఫిల్‌ ఉగ్రవాదుల కాల్పుల్లో బొంగు బాబూరావు మృతి చెందారన్నారు. వీరిద్దరు మృతి చెందిన తర్వాత వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా ప్రకటించలేదని గుర్తు చేశారు. వీర జవాన్‌ ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాకు చెందిన వీర జవాన్లపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. 

అమర జవాన్ల విషయంలో జగన్ సర్కార్ తీరు తీవ్ర విమర్శలు తావిస్తోంది. దేశంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లను ప్రభుత్వం అవమానించినట్లుగా ఉందనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. అయినా కొందరికి పరిహారం ప్రకటించి.. మరికొందరికి ప్రకటించకపోవడం ఏంటని నిలదీస్తున్నారు జనాలు. ఇలాంటి ఘటనలతో రాష్ట్రం పరువు పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జవాన్లకు సాయం చేసే విషయంలో ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుందని.. అలా కాకుండా వ్యవహరించడం సరికాదని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే తప్పును సరిదిద్దుకుని సిక్కోలు జిల్లాకు చెందిన ఇద్దరు వీర జవాన్ల కుటుంబాలకు 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించాలని ఏపీ ప్రజలు, నేతలు కోరుతున్నారు.