సుప్రీం కోర్టులోనే తేల్చుకుంటానంటున్న ఏపీ స‌ర్కార్‌!

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే ప్రపంచంతో పోటీ పడగలరని పదేపదే ఆయన చెబుతుంటారు. అయితే, హైకోర్టు ఆయన దూకుడుకు బ్రేకులు వేశాయి. ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయడం కుదరదని తీర్పు ఇచ్చింది. అయితే, కోర్టు తీర్పు ఇచ్చినా ఇంగ్లీష్ మీడియం విషయంలో వెనక్కు తగ్గేందుకు జగన్ సర్కార్ సిద్ధంగా లేదు. ఇందుకు సంబంధించి అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

అయితే, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసి ఇంగ్లీష్ మీడియానికి బ్రేకులు పడేలా చేసిన బీజేపీ నేత సుధీష్ రాంభొట్ల ఇప్పుడు మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయడంతో ఆయన కూడా సుప్రీంలో తన వాదన వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.

హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం ఇప్పటికే గ్రామ వాలంటీర్ల ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించింది. 96 శాతానికి పైగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలలోనే చదవాలని ఆకాంక్షించారు. మిగతా వారు తెలుగు మీడియం వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ఈ వివరాలను అన్నీ జతచేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. సుప్రీంలో కచ్చితంగా ఇంగ్లీష్ మీడియంకు అనుకూలంగా తీర్పు వస్తుందని ప్రభుత్వం నమ్మకంగా ఉంది.

ఇదే సమయంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) కూడా ఇంగ్లీష్ మీడియం అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలనీ ఎస్‌సీఈఆర్టీ సూచించింది. అయితే, తెలుగు మీడియం కావాలని కోరుకునే వారి కోసం మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాలను కూడా ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది.

ఎస్‌సీఈఆర్టీ నివేదిక, మరో వైపు గ్రామ వాలంటీర్ల ద్వారా సేకరించిన తల్లిదండ్రుల అభిప్రాయాలతో సుప్రీం కోర్టులో వాదనలు చేయనుంది ప్ర‌భుత్వం.

ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలనేది తల్లిదండ్రుల అభిప్రాయమని, వారి అభిప్రాయాల మేరకే ముందుకు వెళుతున్నట్లు చెప్పబోతోంది.

అయితే, తెలుగును తామేమీ నిర్లక్ష్యం చేయడం లేదని, తెలుగును ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేయబోతున్నట్లు ప్రభుత్వం చేబుతోంది.

తెలుగు మీడియం కావాలని కోరుకునే వారి కోసం మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాల కూడా తప్పకుండా ఉంటుందని ప్రభుత్వం వాదిస్తోంది.

ఈ విద్యాసంవత్సరం నుంచే ఒకటవ తరగతి నుంచి ఆరో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో కచ్చితంగా ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలని పట్టుదలగా ఉన్న జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు తీర్పు కీలకంగా మారింది.