కేంద్రంతో మంచిగా ఉంటేనే మేలు

 

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో అగ్గి మీద గుగ్గిలంలా కేంద్రంపై మండిపడిన తెదేపా ఇప్పుడు కొంచెం చల్లబడినట్లుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభించడం వలన రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందనే ఆలోచనతో వెనక్కి తగ్గాలని నిశ్చయించుకొంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం పోరాడి సాధించుకోవాలని చెపుతున్నాయి. ఎందుకంటే అవి ప్రతిపక్షంలో ఉన్నాయి గనుక. గానీ బీజేపీకి మిత్రపక్షంగా, ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెదేపా వాటిలాగ కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వితే ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతినవచ్చును. దాని వలన మహా అయితే ఆ రెండు పార్టీలు నష్ట పోవచ్చును. కానీ అంతకంటే ఎక్కువగా రాష్ట్రం నష్టపోతుంది. అందుకే కేంద్రంతో మంచిగా ఉంటూనే దానిపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టుకోవాలని నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అలాకాక ఆయన కూడా ఆవేశపడి కేంద్రంతో గొడవపడి దానితో తెగతెంపులు చేసుకొని ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏవిధంగా తయారయ్యేదో తేలికగానే ఊహించవచ్చును. అందుకే కేంద్రం తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతూ మంత్రివర్గ తీర్మానం చేసి పంపిద్దామనే ప్రతిపాదనను కూడా ఆయన అంగీకరించలేదు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దూరదృష్టికి చక్కటి నిదర్శనం. తనే స్వయంగా మరోమారు ప్రధాని మోడీని, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్ర పరిస్థితి, బడ్జెట్ కేటాయింపులపై ప్రజల ప్రతిస్పందన అన్నిటినీ వివరించి తగినన్ని నిధులు విడుదల చేయాలని కోరాలని నిశ్చయించుకొన్నారు.

 

కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా సమకూరుతున్న ఆదాయంలో 42 శాతాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకి పంచి ఇచ్చేస్తోంది. మిగిలిన దానిలో దేశ రక్షణ, కేంద్ర ప్రభుత్వ నిర్వహణ, అది ప్రవేశ పెట్టిన వివిధ సంక్షేమ పధకాలకు నిధుల ఏర్పాటు వంటివాటికి కేటాయించడానికి అవసరం ఉంటుంది. మళ్ళీ అందులో సింహభాగం సంక్షేమ పధకాల ద్వారా తిరిగి రాష్ట్రాలకే అందుతుంది. కనుక కేంద్రం ఇప్పటికిప్పుడు వేలకోట్లు నిధులు మంజూరు చేయలేకపోయినా మిగిలిన ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రానికి తగినన్ని నిధులు మంజూరు చేయవచ్చును. ఈ సంగతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు గనుకనే ఆయన కొంచెం వెనక్కి తగ్గారని భావించవచ్చును.

 

కేంద్రంతో పేచీపడి అసలు ఏదీ పొందలేక తిప్పలుపడే బదులు, కేంద్రంతో సయోధ్య పాటిస్తూ నేర్పుగా ఓర్పుగా మెసులుతూ నిధులు రాబట్టుకోవడమే ఉత్తమం. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న రాష్ట్రా ప్రభుత్వాన్ని ఈ సమయంలో కేంద్రం అన్నివిధాల ఆదుకొంటే ప్రజలు కూడా బీజేపీని, మోడీని ఆదరిస్తారు, గౌరవిస్తారు. లేకుంటే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే దాని కలలు కలలుగానే మిగిలిపోవచ్చును.