సిగ్గుంటే రాజీనామా చేసి పదవి వదిలేయాలా? శృతి మించుతున్న విమ‌ర్శ‌లు

సిగ్గుంటే రాష్ట్ర ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజీనామా చేయాలి. ఇది చాలా మంది మంత్రులు, వైసీపీ నేతల మాట. అసలు ప్రభుత్వం ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటుందో అర్ధం కావటం ఐఏఎస్ వర్గాలు తీవ్ర అసహ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

జగన్ సి.ఎం. అయి ఏడాది కావ‌స్తున్నా ఇంకా ప్రభుత్వాన్ని చంద్రబాబే శాసిస్తున్నారనే తరహా వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రతిష్టను ఏమైనా పెంచుతాయా? అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ప్ర‌భుత్వ తీరుపై ఐఏఎస్ అధికారుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం వరకూ ఓకే కానీ..ఐఏఎఎస్ అధికారులను కూడా ల‌క్ష్యంగా చేసుకోవ‌డం మరీ దారుణంగా ఉందని మరో అధికారి వ్యాఖ్యానించారు.

ఎన్నికల సమయంలో రాజ్యంగబద్ద పదవుల్లో ఉన్న వారి విషయంలో సర్కారుకు ఆ వెసులుబాటు ఉండదు. నిజంగా ఎస్ఈసీతో ఏదైనా సమస్య వచ్చినా కూడా ప్ర‌భుత్వం తన పని సాఫీగా సాగిపోయేందుకు తమ సన్నిహిత అధికారులను పంపి ప్రభుత్వ సందేశాన్ని పంపుతుంది. అవసరం అయితే కీలక వ్యక్తులు కూడా రంగంలోకి లాబింగ్ చేస్తారు. చాలా సందర్భాల్లో అప్పుడు పని ఈజీగా అయిపోతుంది. ఇది అందరూ పాటించే పద్దతి. అయితే ఈ ప్రభుత్వంలో ఎంతో మంది సలహాదారుల ఉన్నా ఏ ఒక్క అంశాన్ని కూడా స్మూత్ గా డీల్ చేసే పరిస్థితి లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

 

 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆరు వారాల పాటు ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన వెంటనే ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు..వైసీపీ నేతలు సామాజిక వర్గం పేరుతో ఎటాక్ చేశారు. ఇది సహజంగానే టీడీపీ వ్యతిరేకులకు, వైసీపీ అనుకూలురుకు నచ్చతుంది.

చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన ఐదు వేల కోట్ల రూపాయల రాకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారాన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకూ నమ్మి ఉండొచ్చు. వైసీపీ చేసిన ఈ ఉధృత ప్రచారం వల్ల టీడీపీకి, చంద్రబాబుకు కొంత నష్టం వాటిల్లి ఉండొచ్చు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ‘శృతి మించి’ చేసిన విమర్శలు ఇప్పుడు ఏపీ సర్కారు పరువును జాతీయ స్థాయిలో తీసినట్లు అయిందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వం అన‌వ‌స‌రంగా ఐఏఎస్‌, ఐపిఎస్ అధికారుల జోలికి వెళ్లి రెచ్చ‌గొడుతోంద‌నే చ‌ర్చ రాష్ట్రంలో జ‌రుగుతోంది.