డీజీపీ సవాంగ్ ఎంట్రీ.. తెరపైకి కాల్ మనీ కేసులు, టీడీపీకి తిప్పలు?
Published on: Sat Jun 1, 2019 5:12PM

ఏపీ నూతన డీజీపీగా గౌతం సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని.. ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని అన్నారు. ఏకపక్షంగా కొన్ని వర్గాల కోసమే నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉండదని స్పష్టం చేసారు. అందరూ సమానమేనన్న సవాంగ్.. సీఎం జగన్ చెప్పిన మాట కూడా అదే అని గుర్తు చేసారు.
ఈ ప్రెస్ మీట్ లో సవాంగ్.. అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్ మనీ రాకెట్ గురించి కూడా ప్రస్తావించారు. కాల్ మనీ కేసులను అప్పట్లో విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న సవాంగ్ విచారించారు. ఇప్పుడు డీజీపీగా ఆయన వీటి పైన స్పందించారు. విజయవాడలో 2వేల కాల్‌మనీ కేసులు సెల్‌కు వచ్చాయని.. ప్రతి కేసు డిఫరెంట్‌గా ఉందన్నారు. కాల్‌మనీలో చాలా కేసులు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయని చెప్పుకొచ్చారు.
అయితే సవాంగ్ ప్రెస్ మీట్ లో ప్రత్యేకించి కాల్ మనీ రాకెట్ గురించి ప్రస్తావించడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఎందుకంటే కాల్ మనీ రాకెట్ లో పలువురు టీడీపీ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు టీడీపీని టార్గెట్ చేయడానికి వైసీపీ ప్రభుత్వం ఆ కేసుని తిరిగి తోడనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. టీడీపీ నేత బుద్ధా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావు మీద కూడా కాల్ మనీ ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన వైసీపీలో ఉన్నారు. అంటే ఈ కేసు టీడీపీ నేతలతో పాటు వైసీపీ నేతలను కూడా ఇబ్బంది పెట్టే అవకాశముంది. మరి ఏపీ ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా చట్టం ముందు అందరూ సమానమేనని ముందుకెళ్తుందేమో చూడాలి.


