TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయవాడ అడ్రసే కానీ.. ఆప్ఘనీస్తాన్ హెరాయిన్ కేసులో ఏపీ డీజీపీ వివరణ...

Published on: Thu Sep 23, 2021 8:06PM

ఆప్ఘనీస్థాన్ నుంచి విజయవాడ ట్రాన్స్ పోర్టు అడ్రస్ కు  రవాణా అవుతూ గుజరాత్ పోర్టులో 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడటం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. హెరాయిన్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా విచారణ చేస్తున్నాయి. కేసు విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. విజయవాడ అడ్రస్ పేరుతో హెరాయిన్ ఆప్ఘనీస్థాన్ నుంచి రవాణా అవుతుండటం ఏపీలో కలకలం రేపింది. ఈ ఘటనపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. వైసీపీ పాలనలో ఏపీ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిపోయిందని ఆరోపిస్తున్నాయి. 

గుజరాత్ లో పట్టుబడిన హెరాయిన్ రవాణాకు విజయవాడ లింకులు బయటపడటంతో ఏపీ ప్రభుత్వంలో అలజడి రేగింది. పోలీసులు ఉలిక్కిపడ్డారు. తాజాగా ఈ ఘటనపై వివరణ ఇచ్చారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. హెరాయిన్ విషయంలో ఏపీ పాత్ర ఉందని దుష్ర్పచారం జరుగుతోందని చెప్పారు. పట్టుబడిన హెరాయిన్‌కు ఏపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనిపై డీఆర్ఐ నార్కోటెక్స్ కంట్రోల్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందన్నారు. విజయవాడను ట్రాన్స్‌ఫోర్ట్ అడ్రస్‌గా మాత్రమే వాడుకున్నారని గుర్తుచేశారు డీజీపీ గౌతమ్ సవాంగ్.  అంతకుమించి నగరంలో ఎలాంటి కార్యకలాపాలు లేవని సవాంగ్ వివరించారు. 

చెన్నై కేంద్రంగానే మొత్తం లావాదేవీలు జరిగినట్లు డీజీపీ చెప్పారు. హెరాయిన్ విషయంలో రాజకీయ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం ఆఫీసు పక్కన ఇదంతా జరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతాభావంలోకి నెడుతున్నారని వ్యాఖ్యానించారు. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. అసాంఘిక కార్యకలాపాలకు రాష్ట్రంలో చోటు లేదని తేల్చిచెప్పారు. హెరాయిన్ కేసులో దర్యాప్తు బృందాలకు తాము పూర్తి సహకారం అందిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ క్లారిటీ ఇచ్చారు.