సీఎంతో సీఎస్ భేటీ.. కేబినెట్ భేటీపై వీడని ఉత్కంఠ
Published on: Mon May 13, 2019 12:03PM

ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా ఇద్దరు పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం, సీఎస్ మధ్య భేటీ సుమారు గంట పాటు కొనసాగింది. అనంతరం సీఎస్ తిరిగి సచివాలయానికి వెళ్లిపోయారు. వీరి మధ్య ముఖ్యంగా కేబినెట్ సమావేశంపైనే చర్చ సాగినట్టు తెలుస్తోంది. సీఎస్ అయిన తరువాత.. చంద్రబాబుతో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇంతవరకూ భేటీ కాలేదు. ఫొని తుఫాను సమీక్ష సమయంలోనూ అధికారులను పంపారు కానీ ఎల్వీ రాలేదు.
మరోవైపు రేపు జరనున్న కేబినెట్ సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కేబినెట్ భేటీ నిర్వహణకు అనుమతి కోరుతూ సమావేశం ఎజెండాను సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలోని స్ర్కీనింగ్ కమిటీ.. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది పంపించారు. ఈ నెల 10వ తేదీన ఆ నివేదికను ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపండం జరిగిపోయాయి. అయితే, ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చర్చనీయాశంగా మారింది. ఈరోజు సాయంత్రం లోపు ఈసీ నుంచి అనుమతి వస్తేనే కేబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉంటుంది.


