TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కోడ్ అమల్లో ఉన్నా కేబినెట్‌ భేటీ పెట్టుకోవచ్చు: సీఎస్

Published on: Tue May 7, 2019 2:54PM

 

ఈనెల 10న ఏపీ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు మంగళవారం నాడు సీఎంఓ నుండి నోట్ చేరింది. ఫణి తుఫాను బాధితులకు సహాయక చర్యలపై సమీక్ష, అకాల వర్షాల్లో రైతులకు వాటిల్లిన నష్టం, ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరా వివిధ సమస్యలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. ఈ సమావేశం నిర్వహణ అజెండాను ఎల్వీ సుబ్రహ్మణ్యంకు పంపించారు. ఇదే విషయంపై సీఎంఓ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్‌ సచివాలయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో  భేటీ అయ్యారు. కేబినెట్‌ భేటీకి సంబంధించి చర్చించారు. అనంతరం ఎల్వీ సుబ్రమణ్యం  అందుబాటులో ఉన్న అధికారులతో చర్చించారు.

కాగా కేబినెట్ భేటీపై నిర్ణయం ఈసీ చేతుల్లో ఉంటుందని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున కేబినెట్‌ సమావేశం నిర్వహించకూడదని లేదని.. కానీ ఈసీ అనుమతి తప్పనిసరి అని అన్నారు. కేబినెట్‌ భేటీకి అజెండానే కీలకమని.. అజెండాలోని అంశాల ఆధారంగానే ఈసీ అనుమతిస్తుందని తెలిపారు. ఈక్రమంలో అజెండాలోని అంశాలపై సీఎంవోను సీఎస్‌ వివరణ కోరారు. ఏయే అంశాలపై కేబినెట్‌ భేటీ నిర్వహిస్తున్నదీ ఈసీకి చెప్పాల్సి ఉందన్నారు. అయితే.. కేబినెట్‌ సమావేశం పెట్టే స్థాయి నిర్ణయాలు ఉంటేనే ఈసీ అనుమతిస్తుందని సీఎస్‌ చెప్పారు.