TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ముఖ్యమంత్రే అధిపతి: ఏపీ సీఎస్

Published on: Wed May 8, 2019 12:27PM

 

పరిపాలనా వ్యవహారాలకు ముఖ్యమంత్రే అధిపతి అని, ఏ విషయంలోనైనా ఆయన నిర్ణయమే ఫైనల్‌ అని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం స్పష్టంచేశారు. అధికారులెవరైనా సీఎంని, మంత్రులను కలిసి వారి శాఖల వివరాలు తెలియపరచడానికి ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాదని తెలిపారు. తుఫాను సమయంలో ఆర్టీజీఎస్‌ సీఈవో అహ్మద్‌ బాబు, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ వరప్రసాద్‌ సీఎంను కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితులు వివరించారని, దీనిపై సీఎం కొన్ని విలువైన సూచనలు చేశారని తెలిపారు. ఆ సూచనలు సమంజసంగా ఉండడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చానన్నారు. ప్రస్తుతం పరిపాలన సజావుగానే సాగుతోందన్న సీఎస్.. సీఎం పక్కన సీఎస్‌ కూర్చుంటేనే పరిపాలన సజావుగా సాగుతుందనుకోవడం సమంజసం కాదన్నారు.

ఐఏఎస్‌ అధికారులను రక్షించడం, పోషించడం, వారు పనిచేసేలా అనుకూల వాతావరణం కల్పించాలనే ఆపేక్ష సీఎంకే ఎక్కువగా ఉంటుందని ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. ఐఏఎస్‌లతో పని చేయించుకోవాల్సిన బాధ్యత సీఎందేనని... ఆయనకు లేని ఆపేక్ష తనకెలా ఉంటుందని ప్రశ్నించారు. సీఎం ఏ సమీక్ష సమావేశానికి పిలిచినా తప్పకుండా హాజరవుతానన్నారు. ఇప్పటి వరకు సీఎం తనను ఒక భేటీకి పిలిచారని, ఆ సమయంలో 15వ ఆర్థిక సంఘం సమావేశంలో ఉన్నందున హాజరుకాలేకపోయానని తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఏ సమీక్షలకూ తనను పిలవలేదని ఎల్వీ సుబ్రమణ్యం చెప్పారు.