ఏపీ ఓటరులారా.. మీకు హ్యాట్సాఫ్

 

ఏపీలో ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. కానీ ఓటర్లు మాత్రం వెనకడుగు వేయలేదు. ఈవీఎంలు మొరాయించినా, ఎన్ని ఘర్షణలు జరిగినా, అర్ధరాత్రి వరకు క్యూ లైన్లలో వేచి ఉండి ఓటు వేసి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. తరువాతి తరాలకు, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచారు.

ఏప్రిల్ 11 న ఏపీలో ఎన్నికల పండుగ. ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఉత్సాహంగా ఉదయం నుండే ఓటర్లు పోలింగ్ బూతుల వద్ద బారులు తీరారు. కానీ వందల సంఖ్యలో ఈవీఎంలు మొరాయించాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు మూడు గంటల పాటు ఈవీఎంలు పనిచేయకపోవడంతో.. క్యూ లైన్లలో నిల్చుని నిల్చొని ఓపిక నశించి ఓటర్లు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం తరువాత మళ్ళీ పోలింగ్ బూతులకి వచ్చారు.

భారీ క్యూలు, కొన్ని చోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు, వీటికి తోడు ఘర్షణలు.. ఇవేమి ఓటర్లను ఆపలేకపోయాయి. ప్రధాన పార్టీల శ్రేణులు ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకున్నారు. పార్టీల మధ్య శాంతియుతంగా జరగాల్సిన ఎన్నికల సమరాన్ని, రాజ్యాల మధ్య జరుగుతున్న హింసాత్మక యుద్ధంలా మార్చారు. అయినా ఓటర్లు వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా మహిళలు, వృద్దులు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయించడంతో.. గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. అయినా ఓటు వేసే ఇక్కడి నుంచి వెళ్తామని స్పష్టం చేశారు. అర్ధరాత్రి వరకు క్యూ లైన్లలో వేచి ఉండి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఏపీ ఎన్నికల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. 'ఈవీఎంల బెట్టు, ఓటర్ల పాట్లు.. వేలికి సిరా మరక, ఒంటికి రక్తపు మరకలు' అన్నట్లు జరిగాయి. అయినా ఓటర్లు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా దాదాపు 80 శాతం పోలింగ్ నమోదయ్యేలా చేశారు. ఏపీ ఓటరులారా.. మీకు హ్యాట్సాఫ్.