కోట్లు సంపాదించి ఓట్లకు డబ్బుల్లేవన్న ఏపీ మంత్రి.. అధిష్టానం ఆగ్రహం

 

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికలు అటు అధికార పార్టీ టీడీపీకి, ఇటు ప్రతిపక్ష వైసీపీకి రెండింటికి కీలకమే. దీంతో ఇరుపార్టీల అధినేతలు గెలుపే లక్ష్యంగా బాగా కష్టపడ్డారు. ఫలితాలు రావడానికి ఇంకా వారం రోజులు సమయం ఉంది. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఏపీలో వైసీపీనే అధికారంలోకి వచ్చే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం కొందరు టీడీపీ నేతల తీరే అని తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడి, అహోరాత్రులు శ్రమించి పనిచేస్తే.. కొందరు టీడీపీ నేతలు, మంత్రులు మాత్రం ఎన్నికలను చాలా తేలిగ్గా తీసుకున్నారట. 'గెలిస్తే గెలుస్తాం.. లేదంటే లేదు' సంపాదించిన సొమ్ములను మాత్రం ఎన్నికల్లో ఖర్చు చేయమని తేల్చి చెప్పారట. రాక రాక అధికారంలోకి వచ్చాం.. మంత్రి అయ్యి బాగా సంపాదించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ సంపాదించుకున్నది ఖర్చు పెట్టమంటే మా వల్లకాదని మంకుపట్టుపట్టారట.

పోలింగ్‌ జరిగిన తరువాత.. కొందురు టీడీపీ నేతలు, మంత్రులు వ్యవహరించిన తీరు గురించి చంద్రబాబుకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి ఒకరు మొన్న జరిగిన ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి వెనకడుగు వేసారట. ఐదేళ్లు మంత్రిగా ఉన్న ఈయన ఎన్నికల్లో గెలవాలంటే చేయాల్సిన ఖర్చు గురించి వెనకా ముందాడుతున్న వైనాన్ని తెలుసుకున్న టీడీపీ పెద్దలు.. ఎందుకు ఎన్నికల ఖర్చు కోసం వెనకాడుతున్నారు? గత ఐదేళ్లుగా బాగానే సంపాదించుకున్నారుగా.. కనీసం మీ నియోజకవర్గానికైనా మీరు ఖర్చు పెట్టుకోవాలి కదా? అన్నీ పార్టీ పెద్దలు తేలేరు కదా? అని ప్రశ్నిస్తే.. 'సంపాదించుకున్న సొమ్మును తాను తీయనని, అధిష్టానం సొమ్ములు ఇస్తేనే ఓటర్లకు పంచుతానని తేల్చి చెప్పారట. ఆయన వ్యవహారశైలి చూసిన టీడీపీ పెద్దలు.. మంత్రిగా అడ్డగోలుగా సంపాదించుకున్నారు. ఇప్పుడు మీ ఖర్చులు మీరు పెట్టుకోకపోతే ఎలా? అని ఆక్షేపించారట. అయినా ఆ మంత్రిగారు మాత్రం దిగిరాలేదట. చివరకు పార్టీ అధిష్టానం ఇచ్చిన సొమ్ములను అరకొరగా పంచి మమ అనిపించారట. అయితే ఈ ఎన్నికల్లో ఆ మంత్రి గెలిచే అవకాశముంది కానీ.. ఆయన వైఖరిపై అధిష్టానం ఆగ్రహంతో ఉందని ప్రచారం జరుగుతోంది.

డబ్బులు పంచితేనే గానీ గెలవలేని స్థాయికి నేతలు చేరిపోయారు, పార్టీలు చేరిపోయాయి. దీన్ని బట్టి చూస్తుంటే డబ్బు ఉన్నవాడిదే అధికారం అనిపిస్తోంది. మరి ఈ ఎన్నికల్లో ప్రజలు డబ్బుకి పట్టం కట్టారో.. లేక నేతల పనితీరుకి, పార్టీపై నమ్మకానికి పట్టం కట్టారో.. ఈ నెల 23 న తేలనుంది.