జగన్ స్పీడ్ ను మంత్రులు అందుకోలేకపోతున్నారా?

 

రాజ్యం బాగుండాలంటే రాజు మాత్రమే కాదు... మంత్రులు, అధికారులు కూడా సమర్ధవంతంగా పనిచేయాలి. అప్పుడే ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లు చేయగలుతుతుంది. ప్రజలకు అందాల్సినవి అందుతాయి. సమాజానికి జరగాల్సిన మేలు జరుగుతుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ లో రాజు తప్ప మంత్రులెవరూ పనిచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి అంచనాలు ఒకలా ఉంటే... మంత్రుల పనితీరు మాత్రం మరొకలా ఉందంటున్నారు. దాంతో జగన్ స్పీడ్‌కు తగ్గట్టుగా మంత్రులు అందుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

నవరత్నాలంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ... వాటిని ప్రజలకు అందించాలంటే అధికారుల పాత్ర ఎంతో ముఖ్యం. మంత్రులకు అధికారుల గైడెన్స్ అత్యవసరం. అయితే, మంత్రులుగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు దాటిపోతున్నా, ఇప్పటివరకు వారి కార్యాలయాల్లో ఆంతరంగిక అధికారులను, సిబ్బందిని నియమించుకోలేకపోయారు. బాబు హయాంలో పనిచేసిన వారిలో ఎవరినీ తీసుకోవద్దని సీఎం జగన్ తేల్చిచెప్పడంతో, ఎవరిని నియమించుకోవాలో... ఎవరిని తీసేయాలో తెలియక ఇప్పటికీ తికమకపడుతున్నారట. కొందరు మంత్రులైతే పాత వాళ్లతోనే పని చేయించుకుంటున్నారట. అయితే ఆ మంత్రుల కార్యాలయాల్లో ఎవరెవరు ఏ హోదాలో పనిచేస్తున్నారో ఇప్పటివరకు ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొందట.

ఇక, నవరత్నాల అమలు సంగతి పక్కన పెడితే... కనీసం ప్రతిపక్షం విమర్శలను కూడా మంత్రులు తిప్పికొట్టలేకపోతున్నారని జగన్ సీరియస్ అయ్యారట. ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో మంత్రులు సక్రమంగా వ్యవహరించడం లేదని ఫైరైనట్లు తెలుస్తోంది. గోదావరి వరదల విషయంలో ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవడంలో మంత్రులు పూర్తిగా విఫలమయ్యారంటూ మంత్రులకు జగన్ స్ట్రాంగ్ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా తమతమ పేషీల్లో ఆంతరంగిక అధికారులను, సిబ్బందిని నియమించుకుని... జగన్ స్పీడ్ ను అందుకుంటారో లేదో చూడాలి.