ప్రత్యేక హోదాపై జగన్ కొత్త మాట.. ఇప్పట్లో కష్టమేనట!!

రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రజలు బలంగా కోరుకున్నది ఒక్కటే.. ప్రత్యేక హోదా. కానీ, రాను రాను ఆ కోరిక నెరవేరుతుందన్న నమ్మకం దూరమవుతుంది.

2014 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేకహోదా ఇస్తామని మాట ఇచ్చారు. కానీ, తరువాత ప్రత్యేక ప్యాకేజీ అంటూ మాట మార్చారు. ఇక హోదా రావడం కష్టమే అనుకుంటున్న సమయంలో.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ హోదా తీసుకొస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వానికి హోదా తీసుకురావడం చేతకావడంలేదని, వైసీపీకి అత్యధిక ఎంపీ సీట్లు కట్టబెడితే, కేంద్రం మెడలు వంచైనా తాను హోదా తీసుకొస్తానని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకుంది. కానీ, ఏపీ ప్రజల కోరికైన ప్రత్యేక హోదాని మాత్రం తీసుకురాలేకపోతోంది.

ఈ సంవత్సరం సంవత్సరన్నర కాలంలో జగన్ స్వరం కూడా కాస్త మారింది. ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని చెప్పిన ఆయన.. తీరా ఎన్నికల్లో గెలిచాక.. ఢిల్లీ సాక్షిగా హోదా రావడం కష్టమే అన్నట్టు మాట్లాడారు. హోదా ఇచ్చేవరకు కేంద్రాన్ని బ్రతిమాలాడమే అన్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో హోదాపై చాలామంది ఆశలు వదులుకున్నారు. ఇక తాజాగా, జగన్ వ్యాఖ్యలు చూస్తే.. అసలు ఈ నాలుగేళ్లు హోదా మాటని మర్చిపోతే మంచిది అన్నట్టుంది.

వైసీపీ మేధోమదనం సదస్సులో భాగంగా ‘మన పాలన-మీ సూచన’ పేరుతో సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో.. ప్రత్యేక హోదా ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్రం ఇవ్వలేదని.. హోదా వస్తే ఏపీకి ఎన్నో కంపెనీలు వచ్చేవన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయిందని విమర్శించారు. పూర్తి మెజార్టీతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, లేదంటే ఆ పార్టీకి మద్దతిచ్చే క్రమంలో ప్రత్యేక హోదా డిమాండ్‌ చేసేవాళ్లమని చెప్పారు. ప్రస్తుతం ప్రత్యేక హోదాకు దూరంగా ఉండే పరిస్థితి నెలకొందన్నారు. అయితే, భవిష్యత్‌లో మాత్రం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి వస్తుందని.. అప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్‌ నెరవేర్చాలని డిమాండ్ చేస్తామని జగన్ తెలిపారు.

జగన్ మాటలను బట్టి చూస్తుంటే ఈ నాలుగేళ్లు హోదా మాటని మర్చిపోండి అన్నట్టే ఉంది. ఒకవేళ, వచ్చే ఎన్నికల్లో కూడా కేంద్రంలో మళ్లీ బీజేపీనే పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి?. మళ్లీ ఆ ఐదేళ్లు కూడా హోదాని మర్చిపోవాలా?. అంటే ప్రత్యేక హోదా కావాలని గట్టిగా డిమాండ్ చేయాలంటే కేంద్రంలో ఖచ్చితంగా హంగ్ రావాలి. ఆ హంగ్ ఎప్పుడొస్తుంది?.. ఒకవేళ హంగ్ వచ్చినా.. హోదా డిమాండ్ చేసే అన్ని ఎక్కువ ఎంపీ సీట్లు, వైసీపీ అప్పుడు కూడా గెలుచుకుంటుందా?. ఏంటో.. ఇప్పటికే చాలామంది హోదాపై ఆశలు వదులుకున్నారు. ఇక కొన్నేళ్లు పొతే అసలు హోదానే మర్చిపోతారేమో. అసలు హోదా వస్తుందో రాదో?.. ఒకవేళ వచ్చినా ఎప్పుడొస్తుందో? అంతా ఆ వెంకన్నకే తెలియాలి.