'ఎన్టీఆర్‌ వైద్యసేవ' పథకం పేరు మారింది.. ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్

 

ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని ఆశావర్కర్ల వేతనాలను రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వైద్యఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో జగన్ ఈ మేరకు పలు సూచనలు చేశారు. పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. వైద్యఆరోగ్య శాఖ సమూల ప్రక్షాళనకు ఆరోగ్య రంగంలోని నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని.. సీఎం కార్యాలయం తరపున ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పి.వి.రమేష్ ఆ కమిటీ సమన్వయ బాధ్యతలు చూస్తారన్నారు. వైద్యఆరోగ్య శాఖకు చెందిన అధికారులతో ఆ కమిటీ సమాలోచనలు జరిపి 45 రోజుల్లో నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.

'ఎన్టీఆర్‌ వైద్యసేవ'ను ‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ’గా పేరు మార్చాలని జగన్‌ ఆదేశించారు. ఈ శాఖ తనకు అత్యంత ప్రాధాన్యతతో కూడినదని.. తానే ప్రత్యక్షంగా ఈ శాఖ పనితీరును పర్యవేక్షిస్తానని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగంలో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విధానాలే మనకు ఆదర్శమని చెప్పారు. ఆయన అప్పట్లో అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108 సర్వీసులు వంటి అనేక విధానాలను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని జగన్‌ గుర్తు చేశారు. 108, 104 సర్వీసులను ప్రక్షాళన చేసి.. వాహనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చేయాలని సీఎం ఆదేశించారు. వైద్యఆరోగ్య శాఖకు పూర్వవైభవం తేవాలని.. దేశమంతా ఏపీ వైపు చూసేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్సుల స్థితిగతుల పనితీరుపై ఒక నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను జగన్‌ ఆదేశించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తిస్థాయి అవసరాలు తీర్చేందుకు ఏయే చర్యలు తీసుకోవాలనే అంశాలపై సమగ్రంగా నివేదిక రూపొందించి అందజేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఇతర పోస్టుల భర్తీపై జగన్‌ సానుకూలంగా స్పందించారు. పోస్టుల భర్తీ, ఆర్థిక అవసరాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై నివేదికను తక్షణమే రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

వైద్యవిద్యలో ఇటీవల జరిగిన పరిణామాలపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పెంచడానికి అడ్డంకులు ఎందుకు వస్తున్నాయని.. సౌకర్యాలు లేవని సీట్ల కేటాయింపు చేయకపోతే దానిపై ఎందుకు గట్టిగా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నిబంధనలను వెంటనే సమీక్షించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎటువంటి ఆటంకం లేకుండా వైద్యవిద్య అందేలా చర్యలు చేపట్టాలని జగన్‌ స్పష్టం చేశారు. 

నకిలీ మందులు, నాణ్యత లేని ఔషధాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే సరైన ధరలకు నాణ్యమైన మందులు లభిస్తాయనే విశ్వాసం ప్రజల్లో తీసుకురావాలని.. ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. వైద్య పరికరాలు, మందులు, మౌలిక సౌకర్యాల టెండరింగ్ విధానాలను పునఃసమీక్షించాలని ఆదేశించారు. మొత్తం వైద్య ఆరోగ్య వ్యవస్థలో సమూల మార్పులు రావాలని.. కింది నుంచి పైస్థాయి వరకు పూర్తి ప్రక్షాళన దిశగా చర్యలు ఉంటాయని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.