జగన్ ను బెదిరిస్తున్నదెవరు? రివర్స్ పై అంత మంకుపట్టు ఎందుకు?

 

ఒకవైపు కేంద్రం తప్పుబడుతోంది... మరోవైపు పోలవరం అథారిటీ హెచ్చరిస్తోంది... ఇంకోవైపు నిపుణులు, మేధావులు వద్దంటున్నారు... ఇక ప్రతిపక్షం ఎలాగూ విమర్శిస్తోంది... ఇంతమంది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముప్పేట దాడి చేస్తుంటే... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి మాత్రం వెనక్కితగ్గే ప్రసక్తే లేదంటున్నారు. రివర్స్‌ టెండరింగ్‌కి వెళ్లాలన్న నిర్ణయంపై వెనకడుగు వేసేదే లేదని మరోసారి గట్టిగా తేల్చిచెప్పారు.

పోలవరం టెండర్ల రద్దు, రివర్స్‌ టెండరింగ్‌‌పై అటు కేంద్రం... ఇటు పోలవరం అథారిటీ... ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేయడంతో సీఎం జగన్ రియాక్టయ్యారు. కేబినెట్‌ సబ్‌ కమిటీతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన జగన్... అవినీతిపై పోరాటంలో వెనకడుగు వేయబోమన్నారు. తనపై ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని, మీపైనా ఒత్తిళ్తు వస్తాయని, కానీ ఎలాంటి బెదిరింపులకు లొంగొద్దని దిశానిర్దేశం చేశారు. టెండర్ల ప్రక్రియ మొదలు, తీసుకువచ్చిన అప్పుల వరకూ... ఏది చూసినా వందలు, వేలకోట్ల రూపాయాల్లో కుంభకోణాలు కనిపిస్తుంటే‌.... ప్రజాధనానికి మనం కాపలాదారులుగా ఉండాలా? లేక అవినీతి చేసినవారిని వదిలేయాలా? అంటూ జగన్ ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులే కాదు, ఇళ్ల నిర్మాణంలోనూ పెద్దఎత్తున అవినీతి జరిగిందన్న వైఎస్ జగన్... గత ఐదేళ్లలో జరిగిన అవినీతి బాగోతాలను వెలికి తీయాల్సిందేంటూ కేబినెబ్‌ సబ్‌కమిటీకి తేల్చిచెప్పారు.

30 అంశాల్లో అవినీతిని వెలికితీసే బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించిన సీఎం జగన్... రివర్స్‌ టెండరింగ్‌ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. దేశంలోనే అత్యున్నత పారదర్శక విధానాలతో అవినీతిరహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి గట్టిగా సహకరించాలని, ఒత్తిళ్లను ఖాతరు చేయొద్దని సూచించారు. అయితే, ఇంతమంది వ్యతిరేకిస్తున్నా, రివర్స్ టెండరింగ్ పై జగన్ మొండిగానే ముందడుగు వేస్తున్నారు. మరి ముందుముందు ఈ రివర్స్ గేర్ ఎటువైపు దారి తీస్తుందో...