మేము ప్రారంభించిన పథకాల పేర్లు నేనే మిస్సవుతానేమో అనిపిస్తోంది: సీఎం జగన్
Published on: Sat Jun 20, 2020 2:34PM
'వైఎస్సార్ నేతన్న నేస్తం' పథకానికి సంబంధించి రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం ద్వారా సొంత మగ్గం కలిగి దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. శనివారం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ ఆన్‌లైన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు.
"గతేడాది నా పుట్టినరోజున డిసెంబరు 21న 'వైఎస్సార్ నేతన్న నేస్తం' పథకాన్నిప్రారంభించాం. రెండో విడత సాయాన్ని మళ్లీ అదే రోజున ఇద్దామనుకున్నాం. కానీ కరోనా కష్టకాలంలో నేతన్నలు పడుతున్న కష్టం చూడలేక వారికి ముందుగానే సాయం విడుదల చేస్తున్నాం" అని సీఎం జగన్ తెలిపారు.
81,024 మంది లబ్ధిదారులకు రూ.194.46 కోట్ల సహాయం అందనుందని సీఎం తెలిపారు. అర్హులెవరైనా మిగిలిపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని.. వచ్చే నెలలో ఇదే రోజున ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు. 13 నెలల కాలంలో చేనేతన్నలకు దాదాపు రూ.600 కోట్ల సహాయం చేశామని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం రూ.200 కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన పథకాలు చూస్తుంటే, వాటి పేర్లు నేనే మిస్సవుతానేమో అనిపిస్తోంది అంటూ సీఎం చమత్కరించారు. 13 నెలల్లోనే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు చేశామని సీఎం జగన్ వెల్లడించారు.


