జగన్ రెడ్డి గుండెల్లో హుజూరాబాద్ గుబులు..
Published on: Sat Nov 6, 2021 2:30PM
హుజూరాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ ఓడి పోయింది. ఆ ఓటమి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కంటికి కునుకులేకుండా చేస్తోంది. భరించలేనంతగా బాధిస్తోంది, భయ పెడుతోంది. హుజూరాబాద్ లో ఈటలను ఓడించి, ‘విజయోత్సవ’ జెండా ఎగరేయాలని ఆశించి భంగ పడిన కేసీఆర్ ను హుజూరాబాద్ ఓటమి బాధించిందన్నా, భయపెట్టిందన్నా అర్ధం చేసుకోవచ్చును. కానీ అదేమిటో పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా హుజూరాబాద్ ఫలితం, ఈక్వల గా ఇంకొంచెం ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది. అయనకు సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని అంటున్నారు.
ఎందుకలా? హుజూరాబాద్ తో పాటుగా జరిగిన బద్వేల్ ఉపఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్ధి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రికార్డును బద్దలు కొట్టారు. ఇంచుమించుగా లక్ష మెజారిటీతో విజయం సాధించారు. స్వంత రాష్ట్రంలో అంత గొప్ప విజయం సాధించిన ముఖ్యమంత్రి, పొరుగు రాష్ట్రంలో అధికార పార్టీ ఓటమికి ఎందుకు ఆందోళన చెందుతున్నారు, అంటే...కేసీఆర్, జగన్ రెడ్డి ఇద్దరు వేర్వేరు రాష్ట్రల ముఖ్యమంత్రులు కావచ్చును, వేర్వేరు పార్టీల నాయకులు కావచ్చును కానీ, ఇద్దరిదీ ఒకే పంథా, ఒకటే అజెండా ఇద్దరూ ప్రభుత్వం పరంగా సంక్షేమ పథకాలను ఎరాగావేసి, ఓటు బ్యాంకును ఏర్పరచుకోవడం. పార్టీ పరంగా డబ్బును ఎదజల్లి ఓట్లను దండుకోవడం అనే సింపుల్ ఫార్ములానే నమ్ముకున్నారు.
నిజానికి ఈ విషయంలో జగన్ రెడ్డి మరో ఆకు ఎక్కువే చదివారు, అభివృద్ధి ఊసే లేకుండా, సంక్షేమంతోనే రెంవసారి అధికారం లోకి రావాలనే కళలు కంటున్నారు. కానీ ప్రభుత్వ పధకాల ద్వారానే కాకుండా, పార్టీ పరంగా కూడా వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసినా హుజారాబాద్ ఉపఎన్నికలో కారు పార్టీకి పరాజయం తప్పలేదు. ఇంతవరకు దేశంలో ఎక్కడా లేనంతగా ప్రభుత్వ నిధులను, పార్టీ ఫండ్స్ ఖర్చు చేశారు. ఫ్యామిలీకి పది లక్షల ప్యాకేజి ‘దళిత బంధును’ ప్రకటించారు. ఓటుకు ఆరు వేలు చొప్పున కాష్ కవర్లు అందించారు. అయినా తెరాస అభ్యర్ది ఓడిపోయారు. ఆ కారణంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆందోళన చెందుతున్నారు. అదే కారణంగా ఏపీ సీఎం జగన్ రెడ్డి కూడామ రేపటి తమ భవిష్యత్’ను ఊహించుకుని ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.
నిజానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎవరికి చెప్పవలసిన పాఠం వారికి అప్పగించింది. అహంకారాన్ని, అధర్మాన్ని ప్రజలు క్షమించరు. పది కాదు పాతిక లక్షలు ఇచ్చినా, ఇంకెన్ని ప్రలోభాలకు గురి చేసినా, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే ప్రజలు అసలే క్షమించరని హుజూరాబాద్ ఉప ఎన్నిక మరోమారు రుజువు చేసింది. అందుకే అభివృద్ధి కార్యక్రమాలను గాలికి వదిలివేసి, కేవలం సంక్షేమ పథకాల అమలు ద్వారా వివిధ వర్గాల ప్రజలను ఓట్ బ్యాంకు గా మార్చుకొని రెండోసారి గెలుపొందాలని కల్లు కంటున్న జగన్ రెడ్డి కలవరపాటుకు గురుతున్నారని అంటున్నారు.
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పార్టీ సమావేశం జరపలేదు. పార్టీతో సంబంధమ లేకుండానే మరో మారు గెలిచి గద్దెనెక్కలని ఆశ పడుతున్నారు. గ్రామా వాలంటీర్లను నియమించి, వారినే పార్టీ కార్యకర్తలుగా పనులు చేయించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హుజురాబాద్ లో కేసీఆర్ అటువంటి ప్రయత్నం చేసి ఘోరంగా విఫలం కావడంతో సహజంగానే జగన్ ఆందోళనకు గురవుతున్నారని అంటున్నారు.


