జీతాలు పెంచుతారా.. తగ్గిస్తారా? పీఆర్సీ పై సీఎం జగన్ కీ మీటింగ్..
Published on: Tue Dec 28, 2021 10:27AM
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పీఆర్సీపై సస్పెన్స్ కొనసాగుతోంది. రేపో మాపో అంటూనే నెలలు గడిపేస్తోంది ఏపీ సర్కార్. అనేకసార్లు సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీ... జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరిపినా పీఆర్సీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోయింది. సీఎంతోనే తమకు సమావేశం ఏర్పాటు చేయాలని గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెప్పారు. వారంలో సీఎంతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని సీఎస్ హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మంగళవారం పీఆర్సీపై అధికారులతో సీఎం చర్చించనున్నట్టు సమాచారం.
14.29 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో ప్రభుత్వ చేసిన ప్రతిపాదనలను మూకుమ్మడిగా అన్ని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. ఇప్పటికే పలుమార్లు అధికారులు సీఎంతో పీఆర్సీపై చర్చించినా.. ఫిట్‌మెంట్ ఎంత ఇవ్వాలి అనేదానిపై స్పష్టతకు రాలేదని తెలుస్తోంది. ఎంత ఇస్తే ఎంత అవుతుందో... ఉద్యోగుల నుంచి తర్వాత వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న ఆందోళన సర్కార్ లో కనిపిస్తోంది. పీఆర్సీ ఇవ్వకుండా ప్రభుత్వం ఇప్పటికే చాలా సమయం గడిపేసింది.13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల నుంచి, ఆయా సంఘాల నేతల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో ప్రభుత్వం గత నెలరోజుల నుంచి పీఆర్సీపై మల్లగుల్లాలు పడుతోంది.
గత రెండు నెలల నుంచి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలంటూ అధికారుల కమిటీ సమావేశాలు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద సమావేశాలు, సీఎం వద్ద సమావేశాలు అంటూ పీఆర్సీపై ప్రభుత్వం చేస్తున్న హడావుడీ, ఇస్తున్న లీకులతో ఉద్యోగుల్లో రోజు రోజుకు పీఆర్సీ ప్రకటనపై ఉత్కంఠ పెరుగుతోంది. 11వ పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై ఉద్యోగులు కోటి ఆశలుపెట్టుకున్నారు. కరోనా ఇబ్బందులు, పెరిగిన ధరలకు అనుగుణంగా ఫిట్‌మెంట్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం 10వ పీఆర్సీ ఫిట్‌మెంట్ 43 శాతం ఇచ్చిందని.. కనీసం ఈ ప్రభుత్వం సంఖ్యలను అటూ ఇటూ మార్చి అయినా 34 శాతం ఫిట్‌మెంట్ అయినా ఇస్తుందా?లేదా? అనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతోంది.
పీఆర్సీ ప్రకటనతో పాటుగా మానిటరి బెనిఫిట్ ఎప్ప టి నుంచి ఇవ్వాలి అనే అంశాలపైనా ప్రభుత్వం తరచూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధం గా 10వ పీఆర్సీలో 10 నెలల ఎరియర్స్‌ను ఉద్యోగులకు చెల్లించింది. ఈ ప్రభుత్వం ఏం చేయనుందో అనే అంశంపైనా ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది. ఎరియర్స్ ఇస్తారో... కరోనా, ఆర్థిక పరిస్థితులు సాకు గా చూపి ఎగ్గొడతారో అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరగనున్న సమావేశంపై ఉద్యోగులు గంపెడు ఆశ లు పెంచుకున్నారు.


