రఘురామ దెబ్బకు విలవిల.. కేంద్రంతో జగన్ కాళ్లబేరమా?
Published on: Sun Jun 6, 2021 2:14PM
సీఎం జగన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన. కేంద్ర హోంశాఖ అమిత్‌షాతో భేటీ. పోలవరం, వ్యాక్సిన్లు, మూడు రాజధానులు, ప్రత్యేక హోదా..ఎప్పటిలానే ఇదీ ఎజెండా. అధికారికంగా ఇదే ప్రకటన. కానీ, ప్రజలెవరూ ఈ విషయాన్ని నమ్మే పరిస్థితి లేదంటున్నాయి ప్రతిపక్షాలు. జగన్‌రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళుతున్నారో.. అమిత్‌షాను ఏ ప్రయోజనాల కోసం కలుస్తున్నారో.. అందరికీ తెలిసిన సంగతే అంటున్నారు. గతంలోనూ పలుమార్లు మోదీ, అమిత్‌షాలను జగన్‌రెడ్డి కలిశారని.. అయినా రాష్ట్రానికి ఏం సాధించిపెట్టారని ప్రశ్నిస్తున్నారు. పైపైకి ఎజెండా ఏదున్నా.. లోలోన మాత్రం మేటర్ మరోటనేది ఢిల్లీ వర్గాల మాట.
సీఎం జగన్‌రెడ్డి హస్తిన వెళ్లడానికి కర్త, కర్మ, క్రియ.. అక్షరాలా రఘురామకృష్ణరాజునే అంటున్నారు. ఎంపీ రఘురామ ఢిల్లీలో కూర్చొని.. జగన్‌రెడ్డిని చక్రబంధనంలో బంధిస్తూ ఉంటే.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక్కో పావు కదుపుతూ.. చెక్ పెడుతుంటే.. ఆ చక్రవ్యూహంలో చిక్కుకుపోయి జగన్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెబుతున్నారు. అందుకే, ఆ ఊబిలోంచి బయటపడేందుకే.. కేంద్ర హోంశాఖ శరణుకోరడానికే.. జగన్‌రెడ్డి హస్తిన బాట పట్టాల్సి వచ్చిందని అంటున్నారు. అనవసరంగా రఘురామతో పెట్టుకొని.. ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో పడ్డారని తెలుస్తోంది. ఇటు, బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురామ వేసిన పిటిషన్.. అటు, రఘురామ అరెస్ట్, కస్టడీలో టార్చర్ ఎపిసోడ్‌ను ఢిల్లీ స్థాయిలో న్యాయ, శాసన, రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లడం.. ఇలా సీబీఐ, సీఐడీ కేసులతో జగన్‌రెడ్డి ప్రమాదంలో ఉన్నారని అంటున్నారు. సీబీఐ, సీఐడీ కేసుల ఇబ్బందుల నుంచి బయటపడటమే.. జగన్, అమిత్‌షాల భేటీ పరమార్థం అని ప్రచారం జరుగుతోంది.
జగన్ బెయిలు రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ కేసులో వేగంగా విచారణ జరుగుతోంది. జగన్ బెయిలు రద్దు పిటిషన్‌లో సీబీఐ తన వైఖరి స్పష్టం చేయకుండా విషయాన్ని కోర్టుకే వదిలేయడం ఆసక్తికర పరిణామం. అటు, రఘురామను రాజద్రోహం కేసులో సీఐడీ అరెస్ట్ చేయడం, కస్టడీలో రఘురామ కాళ్లకు గాయాలవటం.. జాతీయ స్థాయిలో వివాదంగా మారింది. తనపై జరిగిన దారుణంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, లోక్‌సభ స్పీకర్, ఎన్‌హెచ్ఆర్సీకి స్వయంగా ఫిర్యాదు చేయడం.. మోదీ, అమిత్‌షాతో సహా పార్లమెంట్ ఎంపీలందరికీ లేఖలు రాయడం.. ఇలా జగన్‌రెడ్డిని జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టారు రఘురామ. ఈ విషయంలో జగన్‌రెడ్డి సర్కారు తీరుపై కేంద్రం చాలా సీరియస్‌గా ఉందని తెలుస్తోంది.
రఘురామ ఘటనలో అసలేం జరిగిందనే విషయంపై ఇప్పటికే కేంద్రహోంశాఖ వివరాలు సేకరించిందని సమాచారం. జరిగిన నష్టాన్ని గుర్తించిన జగన్‌రెడ్డి.. అమిత్‌షాను కలిసి వివరణ ఇచ్చుకునేందుకు ఆయనతో భేటీకి సిద్ధమయ్యారని అంటున్నారు. అటు, బెయిల్ రద్దు కేసులో సీబీఐ దూకుడుతో బెంబేలెత్తిన జగన్‌రెడ్డికి ఢిల్లీ వెళ్లక తప్పని 'పొలిటికల్ ఎమర్జెన్సీ' పరిస్థితి వచ్చిందనేది విశ్లేషకుల మాట.


