TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

త్వరలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు

Published on: Fri Dec 26, 2014 7:50AM

 

గత అనేక దశాబ్దాలుగా ఎక్కడవేసిన గొంగళి అక్కడేనన్నట్లుగాపడున్న పోలవరం ప్రాజెక్టుని వచ్చే నాలుగేళ్లలో పూర్తిచేయాలని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు మరియు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో నిన్న హైదరాబాద్ లో సమావేశమయిన ఆయన త్వరలోనే కేంద్రం నుండి పోలవరం ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు రాబోతున్నాయని తెలిపారు. కనుక ఈలోగానే ప్రాజెక్టుకు అవసరమయిన భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుతో సహా ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలలో మరియు రాయలసీమలో నాలుగు జిల్లాలలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనులన్నిటినీ కంప్యూటరించాలని కోరారు. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించేందుకు రాష్ట్ర ఆర్ధిక, భారీ నీటి పారుదల మరియు విద్యుత్ శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని సూచించారు. ఆ కమిటీ ప్రతీ పదిహేను రోజులకీ ఒకసారి సమావేశమవుతూ ప్రాజెక్టు పనులపై పురోగతిని సమీక్షించాలని ఆయన ఆదేశించారు. తను కూడా స్వయంగా ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటానని ఆయన తెలిపారు.

 

రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రప్రభుత్వమే దాని పూర్తి బాధ్యత తీసుకొంటుందని విభజన బిల్లులో స్పష్టంగా హామీ ఇవ్వబడింది. అందుకే మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన వెంటనే ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురయ్యే ఏడు మండలాలను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేసారు. ఈ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏమీ మాట్లాడకపోయినప్పటికీ, దానికి అవసరమయిన అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరు చేసేందుకు కసరత్తు పూర్తి చేస్తోంది. ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడం అంటే ప్రాజెక్టు కోసం నిధుల విడుదలకు ఆర్ధిక శాఖ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతునట్లేనని చెప్పవచ్చును. బహుశః అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు తొందరపడుతున్నారు. ఈసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రాజెక్టు పూర్తి చేయాలని ద్రుడసంకల్పంతో ఉన్నందున, మధ్యలో ఎటువంటి ఆటంకాలు కలుగకపోతే బహుశః 2018నాటికి పోలవరం పూర్తయి, రాష్ట్రంలో మరింత భూమి సాగులోకి రావచ్చును.