వచ్చే రెండు, మూడు సీట్లకు జగన్ అప్పుడే బేరాలు
Published on: Sat May 4, 2019 5:03PM

ఈ ఎన్నికల్లో ఎంతోమంది విలన్లను తట్టుకొని నిలబడ్డామని, ఏపీలో మళ్లీ టీడీపీ ప్రభుత్వమే వస్తుందని.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సార్వత్రిక ఎన్నికలపై అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో టీడీపీ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీకి వ్యతిరేకంగా మోదీ, కేసీఆర్ అనేక కుట్రలు చేశారని మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు ప్రజలందరి అభిప్రాయాలూ తీసుకున్నాం. మన పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యర్థులు పన్నిన కుట్రలను పోటాపోటీగా ఎదుర్కొన్నాం అన్నారు. కార్యకర్తలతో మమేకమయ్యే టీడీపీ లాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదు అన్నారు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని మోదీ ప్రయత్నాలన్నీ చేశారు. టీడీపీకి ఏదోలా నష్టం కలిగించాలనేదే బీజేపీ ధ్యేయం అని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీకి నష్టం కల్గించేందుకు కేసీఆర్ కూడా ప్రయత్నించారన్నారు. రాష్ట్రంలో జగన్ కుట్రలకు మోదీ, కేసీఆర్ కుతంత్రాలు తోడయ్యాయి అని మండిపడ్డారు. ఎందరు ఇబ్బందులు పెట్టినా ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారన్నారు.
ప్రమాణాలు, ముహూర్తాలు, మంత్రి పదవులంటూ వస్తోన్న వార్తలన్నీ వైసీపీ మైండ్‌గేమ్‌లో భాగమే అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ఓటింగ్ శాతం తగ్గించేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. ఆ కుట్రలు తెలిసే ఓటింగ్‌కు తరలిరావాలని ప్రజలకు నేను పిలుపునిచ్చాను అన్నారు. రాష్ట్రంలో టీడీపీ విజయంపై సందేహం లేదు. సీట్లు, ఆధిక్యతపైనే దృష్టి ఉందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీశారని, అయితే ఏపీలో అలాంటి పరిస్థితి రాలేదని చంద్రబాబు అన్నారు. టీడీపీ తప్పు చేసిందని ఎవరైనా నిలదీశారా? అని ప్రశ్నించారు. అందరూ గర్వంగా చెప్పుకోవాల్సింది ఇదేనని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో తొలి దశలోనే ఎన్నికలు పెట్టడం టీడీపీకి మేలు చేసింది అన్నారు. ఓటర్లు ఏపీకి రాకుండా కేసీఆర్ కుట్రలు పన్నారని ఆరోపించారు. ఓటర్లు ఓటు వేయకుండా అనేక ప్రయత్నాలు చేశారన్నారు. సొంత వాహనాల్లో వచ్చి మరీ పట్టుదలతో ఓటర్లు ఓట్లు వేసి వెళ్లారని కొనియాడారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ అనేక రంగాల్లో ముందుంది. రాష్ట్రాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలనేదే నా సంకల్పం అని చంద్రబాబు చెప్పారు.
మోదీతో మొదట్లోనే గొడవ పెట్టుకుంటే ఏపీ నష్టపోయేదని చంద్రబాబు అన్నారు. అయితే తాము ఓపికగా ఎదురు చూసినప్పటికీ నిర్లక్ష్యం చేశారనే నింద మోదీకే వచ్చిందని ఆయన గుర్తు చేశారు. టీడీపీ పోరాటం రాష్ట్రం, దేశం, వ్యవస్థల కోసమని అన్నారు. వైసీపీ పోరాటం స్వార్థం, పదవి, కేసుల మాఫీ కోసమని విమర్శించారు. వచ్చే రెండు, మూడు సీట్లకు జగన్ అప్పుడే బేరాలు ప్రారంభించారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.


