ధర్మపోరాట దీక్ష .. ఖబర్దార్ మోదీ

 

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది. కేంద్రం మధ్యంతర బడ్జెట్‌లోనూ ఏపీకి మొండిచెయ్యి చూపడంతో చంద్రబాబు ఢిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్ష చేయాలని నిర్ణయించారు. దీంతో ఢిల్లీలోని ఏపీ భవన్‌ వేదికగా ఈ రోజు దీక్షను ప్రారంభించారు. నల్లచొక్కాతో దీక్షకు హాజరయ్యారు.

ధర్మపోరాట దీక్షను ప్రారంభించిన చంద్రబాబు.. మోదీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదే ఏపీ భవన్ సాక్షిగా ఎన్నో ఉద్యమాలు ప్రారంభించామని.. అవన్నీ జయప్రదం అయ్యాయని అన్నారు. ఇవాళ్టి ధర్మపోరాట దీక్ష కూడా విజయవంతమవుతుందన్నారు. తాము చేస్తున్న పోరాటం ఐదు కోట్ల ప్రజల మనోభవాలకు సంబంధించినదని.. ఖబర్దార్.. జాగ్రత్తగా ఉండండని మోదీ సర్కార్‌ని హెచ్చరించారు. హక్కుల కోసం పోరాడుతున్నామని... భిక్ష కోసం కాదన్నారు. వివక్ష చూపిస్తే.. ఆటలు సాగవని చెప్పడానికే ఢిల్లీకి వచ్చామన్నారు. లెక్కలు చెప్పడానికి తాము సిద్ధమని.. తాము కట్టిన పన్నులు చెప్పడానికి మోదీ సర్కార్ సిద్ధమా అని ప్రశ్నించారు.

ఇప్పటికైనా మూడు రోజుల టైముంది.. ఇది తప్పని పార్లమెంటులో అంగీకరిస్తే తెలుగు ప్రజలు క్షమిస్తారు.. చేయకపోతే ఏపీ ప్రజానీకం శాశ్వతంగా బీజేపీని బహిష్కరిస్తారు. ఏపీ చరిత్రలో బీజేపీ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. ఏపీలో బీజేపీకి పూర్తిగా తలుపులు మూసుకుపోతాయి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేవరకు ఈ పోరాటం ఆగదు. ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారు. మేము కన్నెర్ర చేస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఢిల్లీకి రావాలంటే అడ్డంకులు సృష్టిస్తారు. నిన్న గుంటూరు వచ్చారు.. ప్రత్యేక హోదాపై మాట్లాడారా? ఏపీలో అడుగుపెట్టే హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నా? అనుకున్నది సాధించే వరకు ఎంత దూరమైనా వెళ్తాం అంటూ చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు చంద్రబాబు రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మ గాంధీకి, ఏపీ భవన్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. దీక్షా వేదికపై గాంధీ, అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ చిత్ర పటాలకు చంద్రబాబు నివాళులర్పించారు. రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షకు ఏపీ నుంచి వేలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులతోపాటు పలు జాతీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. వివిధ తెలుగు సంఘాలు, విద్యార్థి సంఘాలు దీక్షకు మద్దతు పలికాయి.