TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ నెల 11 తర్వాత జగన్ పరిస్థితి ఏంటి..?

Published on: Mon Jan 2, 2017 7:06PM

పులివెందుల..ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి..సుమారు మూడు దశాబ్ధాల పైగా పులివెందుల కేంద్రంగా ఆయన రాష్ట్ర రాజకీయాలను శాసించారు. వైఎస్ మరణానంతరం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వైఎస్ బతికున్నంతకాలం పులివెందుల వైపు చూడటానికి ప్రత్యర్థులు భయపడేవారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి తెలుగునాట కాంగ్రెస్ పునాదుల్ని పెకలించిన ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం ఇక్కడి జనం వైఎస్‌కే పట్టం కట్టారు. స్థానికుడు కావడం..స్థానిక సమస్యలపై పట్టు ఉండటంతో వైఎస్ కుటుంబానికి పులివెందులలో తిరుగు లేకుండా పోయింది.

 

ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు పులివెందులలో పాగా వేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు..కానీ అది కలగానే మిగిలిపోయింది. అయితే ఇన్నేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ వైఎస్ కోటను బద్దలుకొట్టే అవకాశం వచ్చింది. కడప జిల్లాకు కృష్ణాజలాలను తరలించాలని ఎందరో ముఖ్యమంత్రులు భావించారు..కానీ అది కాగితాలకే పరిమితమయ్యింది తప్పించి కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు.

 

అయితే రాష్ట్ర విభజన జరగిన తర్వాత సాగునీటి రంగానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండికోట ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించి అధికారులను పరుగులు పెట్టించారు. సీఎం పట్టుదల, అధికారుల కృషి ఫలితంగా ఈ నెల 11న ఈ కల సాకారం కాబోతోంది. ఆ రోజున స్వయంగా పైడిపాళేనికి కృష్ణజలాలను విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి. చంద్రబాబుకు ఈ ప్రాజెక్ట్ వల్ల రెండు లాభాలున్నాయి. బాబు కడప జిల్లాను చిన్నచూపు చూస్తున్నారన్న ప్రతిపక్షనేత జగన్‌ ఆరోపణలను తిప్పికొట్టడం ఒకటైతే..కడప జిల్లాకే చెందిన వైఎస్ సీఎంగా ఉండి కూడా సాధించలేని ప్రాజెక్ట్‌‌ను తాము సాధించగలిగామని బాబు ఘనంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.