TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మెట్రో వివాదంలోకి నన్నెందుకు లాగుతారు?

Published on: Sat Sep 20, 2014 8:04AM

 

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో చెలరేగిన వివాదం వెనుక ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఉందని కొందరు ఆరోపణలు చేయడంతో దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ “ఒకప్పుడు ఈ ప్రాజెక్టు బెంగళూరుకు తరలిపోతుంటే దానిని నేనే హైదరాబాదుకి తీసుకువచ్చాననే సంగతి చాలా మందికి తెలియదు. అటువంటివారు ఇప్పుడు నాపేరును కూడా ఈ వివాదంలోకి లాగి నాపై కూడా నిరాధారమయిన ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏమయినా సమస్యలుంటే వాటిని యల్.యండ్.టీ. సంస్థ, తెలంగాణా ప్రభుత్వం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి తప్ప ఈవిధంగా ఇతరులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం, నిందించడం మంచి పద్ధతి కాదు,” అని అన్నారు.

 

తెదేపా శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి మెట్రో ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని, వాటికి తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని నేటికీ తెరాస ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. కానీ ఆయన ఆరోపణలపై కొందరు తెరాస నేతలు ఎదురు దాడి చేయడానికే పరిమితమయ్యారు తప్ప ఇంతవరకు కూడా తెలంగాణా ప్రభుత్వం నుండి ఆ ఆరోపణలకు సరయిన సమాధానం రాకపోవడం గమనార్హం. కానీ ఆయన చేస్తున్న ఈ ఆరోపణల కారణంగా తెరాస ప్రభుత్వం ఇబ్బందులలో పడటం మాటెలా ఉన్నప్పటికీ, వాటి వలన తెదేపా-తెలంగాణా నేతల మధ్య చిచ్చు రగులుతున్నట్లు తెలుస్తోంది. అదే నిజమయితే దానివల్ల తెదేపాకు కూడా ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఇది తెలిసీ కూడా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీనికి దూరంగా ఉండేందుకే మొగ్గు చూపడం గమనిస్తే, ఈ మెట్రో వివాదంలో ఆయనకు ఎటువంటి సంబంధము లేదని స్పష్టమవుతోంది. కనుక ఈ సమస్య నుండి తెలంగాణా ప్రజల దృష్టి మళ్ళించడానికే కొందరు పనిగట్టుకొని ఆయన పేరును కూడా ఈ వివాదంలోకి లాగుతున్నట్లు భావించవలసి ఉంటుంది.