TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ

Published on: Mon Nov 18, 2024 5:00PM

సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ థియోటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్  పోసాని కృష్ణమురళిపై  ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోసాని ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారం చేశారంటూ తెలుగుదేశం రాష్ట్ర తెలుగుయువత ప్రతినిథి  బండారు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. పోసాని వ్యాఖ్యలు చంద్రబాబును కించపరిచేలా, వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్నాయని బండారు వంశీకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా కులాల మధ్య చిచ్చు పెట్టేలా పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోసానిపై సీఐడీ అధికారులు భారత న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  

వైసీపీ హయాంలో అధికారం అండతో   సామాజిక మాధ్యమంలో ఇష్టారీతిగా చెలరేగిపోయి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసిన ఒక్కొక్కరికీ ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. బూతులు, దూషణలే విమర్శలు అన్నట్లుగా చెలరేగిపోయిన వారిపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. ఆ క్రమంలోనే పోసాని కృష్ణ మురళిపై సైతం రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ లో, రాజమహేంద్రవరంలో ఇప్పటికే పోసానిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ సీఐడీ కూడా పోసానిపై కేసు నమోదు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కూడా కేసు నమోదు కావడంతో పోసాని అరెస్టు అనివార్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.