రాజధాని తరలింపుకు ముహూర్తం ఖరారు.. ఇది ఫిక్స్!!

ఏపీ రాజధాని తరలింపుకు విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి దివ్యమైన ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు ఈ లాక్ డౌన్ సమయంలోనే రాజధాని తరలింపు ఉంటుందని వార్తలొచ్చాయి. వాస్తవానికి నేడు(మే 28) కొద్దిమంది స్టాఫ్ తో అమరావతి నుంచి విశాఖకు తరలిపోవాలని భావించారు. అయితే చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు. కాగా, ఇప్పుడు అక్టోబర్ 25 న రాజధాని తరలింపుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలాఖరువరకు దివ్యమైన ముహుర్తాలు లేవని, అక్టోబర్ 25 విజయదశమి రోజున రాజధాని తరలింపుకు శ్రీకారం చుడితే.. అంతా విజయం చేకూరుతుందని స్వరూపానందేంద్ర స్వామి చెప్పడంతో.. అదేరోజున రాజధాని తరలించాలని జగన్ సర్కార్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు స్వరూపానందేంద్ర స్వామిపై ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సీఎం అవ్వకముందు, సీఎం అయిన తరువాత అనేకసార్లు స్వరూపానందేంద్రను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి కూడా ఆయననే ముహూర్తం పెట్టారు. పలు విషయాల్లో జగన్ కి సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటారు. రాజధాని తరలింపుకు కూడా ఆయన చేతనే ముహూర్తం పెట్టించిన జగన్.. విజయదశమి రోజు నుంచి విశాఖ వేదికగా పాలన సాగించనున్నారని సమాచారం.