ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది
Published on: Tue May 7, 2019 6:08PM

ఏపీ కేబినెట్ భేటీ ఈ నెల 14న జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 10న కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్టు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి సీఎం కార్యాలయం లేఖ పంపిన సంగతి తెలిసిందే. అయితే ముందస్తు అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాల్సి ఉండటంతో సమావేశం వాయిదా పడింది. సీఎంవో లేఖ పంపిన నేపథ్యంలో అధికారులతో సమాలోచనలు జరిపిన సీఎస్.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి తప్పనిసరని, రెండు రోజుల ముందే ఈసీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ అజెండాను సీఎంవో సీఎస్‌కు పంపింది. ఫొని తుపాను, రాష్ట్రంలో కరవు పరిస్థితులతో పాటు నీటి ఎద్దడి, ఉపాధి హామీ కూలీలకు చెల్లింపుల్లో నెలకొన్న అడ్డంకుల తదితర అంశాలపై చర్చిస్తామంటూ అజెండా నోట్‌లో పేర్కొంది. సీఎంవో పంపిన అంశాలను ఆయా శాఖల కార్యదర్శలకు సీఎస్ పంపనున్నారు. వారి నుంచి సమాచారం వచ్చాక సీఎస్ నేతృత్వంలోని కమిటీ పరిశీలించి ఈసీకి పంపుతారు.


