బళ్లారి కేంద్రంగా రాయలసీమలో ఓట్ల కొనుగోళ్లు?
Published on: Mon Jun 11, 2012 12:46PM
ఇరుగు, పొరుగు రాష్ట్రాల సరిహద్దులను ఓటింగ్ అక్రమాలకు వినియోగించుకుంటున్నారు. రాయలసీమ ఉప ఎన్నికల్లో ఓట్ల కొనుగోళ్లకు బళ్లారి కేంద్రమైంది. ఇక్కడ నుంచి కొందరు నేతలు చక్రం తిప్పుతున్నారు. బళ్లారిలోని లాడ్జీలు, హోటళ్లలో బస చేస్తే తనిఖీల్లో బయటపడతామని ప్రయివేటు భవనాలు, గెస్ట్ హౌస్ లను ఉపయోగించుకుంటున్నారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు బళ్లారికి దగ్గరగానే ఉన్నాయి. తక్కువ సమయంలో ఎన్నికలు జరిగే ప్రాంతాలకు చేరుకోవచ్చు. అందువల్ల బళ్లారిలోనే ఉంటూ రాత్రిళ్లు గుట్టుగా అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాలకు కొందరు నేతలు వస్తున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని ముందుగానే పసిగట్టే పోలీసుల కన్నుగప్పి ఈ నేతలు నియోజకవర్గాల్లోకి చొచ్చుకువస్తున్నారు. వీరి ప్రధానమైన పని ఓట్లు కొనుగోలు చేయటమే. అందుకే రాత్రి వరకూ వేచి చూసి అప్పుడు తీరిగ్గా రాయదుర్గం, అనంతపురం తదితర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. పంపిణీ పూర్తయ్యాక తిరిగి బళ్లారి వెళ్లిపోతున్నారు. గత నాలుగు రోజులుగా ఎన్నికల అక్రమాలకు పాల్పడిన వాహనాల రిజిస్ట్రేషన్ పరిశీలిస్తే కర్నాటక రాష్ట్ర ఆమోదంతో అవి నడుస్తున్నాయని అధికారులు గుర్తించారు.


