పరకాలపై ఆశలు వదులుకున్న దేశం?
Published on: Mon Jun 11, 2012 4:20PM
పరకాల అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ ఆశలు వదులుకుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఒక్కసారి వచ్చి వెళ్లిపోయారు. పార్టీ నేతలైతే తిరగటమే మానేశారు. తెలంగాణాటిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు, పిఎసి ఛైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి, రాజ్యసభ సీటు పొందిన గుండుసుధారాణి, మాజీ మంత్రి కడియం శ్రీహరి ప్రచారానికి చివరి రోజున ఎక్కడా కనిపించలేదు. ఎన్నికలు జూన్ 12న అయితే ముందుగానే పార్టీ నేతలు, కార్యకర్తలూ ప్రచారంలో కనిపించలేదు. రాష్ట్రంలోని (పరకాలను మినహాయించి ) 17 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సుడిగాలి పర్యటనలు చేశారు. ఆయన్ని పరకాల పర్యటనకు రమ్మని ఇక్కడి నేతలు కోరకపోవటం వారి జాగ్రత్తకు అద్దంపడుతోంది. అలానే ఈ నియోజకవర్గంపై పార్టీకి ఆశలు లేదన్న విషయాన్ని చాటుతోంది.


