కాపుకాస్తున్న కడపనేతలు?
Published on: Mon Jun 11, 2012 1:05PM
రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ కడపనేతలు చొచ్చుకువస్తున్నారు. కడప జిల్లాలో ఎన్నికలు జరగని ప్రాంతాల నుంచి వీరిని జట్లుగా ఎంపిక చేసి మరీ పంపించారు. ప్రచారం ముగింపునకు రెండు రోజుల ముందే అన్ని నియోజకవర్గాల్లోనూ మాటేసిన ఈ కడపనేతలు రాత్రిపూట డబ్బు పంపిణీ చేస్తున్నారు. పగలంతా పోలీసుల దృష్టికి దొరకని ప్రాంతాల్లో వీరు గడుపుతున్నారు. రాత్రి పది గంటలు దాటాకా ఓటర్ల జాబితాల ఆధారంగా వెదుక్కుంటూ వెళ్లి మరీ డబ్బు పంపిణీ చేస్తున్నారు. పోలీసుల రాకను తెలుసుకునేందుకు కూడా వీరు ఏర్పాట్లు చేసుకునే పంపిణీ పూర్తి చేస్తున్నారు. ఇంకా ఒక్కమాటలో చెప్పాలంటే పోలీసులకు కొందరిని ఎరగా వేసి వారిని విచారించే లోపు తమ పనిని చాకచక్యంగా చక్కపెట్టుకుంటారు.
కడప జిల్లాలోని సిద్దవటంలో ఓటుకు ఐదొందల రూపాయలు చెల్లించారు. నందులూరులోనూ ఇంటింటికి తిరిగి మరీ చెల్లింపులు పూర్తి చేశారు. రాయచోటిలో ఒక పార్టీ ఓటుకు ఐదొందలు ఇస్తే, మరో పార్టీ ఇంటికి వెయ్యి రూపాయలు ఖర్చు చేసింది. ఒక్క కడప జిల్లాలో ఇప్పటి వరకూ ఎన్నికల అక్రమాలకింద ఏడు కోట్ల 82 లక్షల 40 వేల 881 రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకుని ఆదాయపన్ను శాఖకు అప్పగించారు. అలానే అనంతపురం జిల్లాలో ఒక్క కణేకల్లులో 15.50 లక్షల రూపాయలు దొరికింది. తిరుపతిలోనూ భారీగానే డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


