300 కోట్లు దాటుతున్న ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు
Published on: Mon Jun 11, 2012 12:21PM
అభ్యర్థులే పోటీపడి మరీ ఓటుకు విలువను పెంచేస్తున్నారు. అంటే ఓటరు అడిగినంత డబ్బు ఇచ్చేస్తున్నారు. దీంతో నియోజకవర్గానికి 10కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనుకుంటే ఇప్పుడు అది సగటున 18 కోట్ల రూపాయల వరకూ చేరుతోంది. ఒక నియోజకవర్గంలో 16 కోట్ల రూపాయలు, ఇంకో నియోజకవర్గంలో 20కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తున్నారు. దీంతో సగటున నియోజకవర్గానికి 18కోట్ల రూపాయల వరకూ ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ ఖర్చు పెడుతున్నారు. ఒక్క నియోజకవర్గంలో ఒక అభ్యర్థికి ఎన్నికల పేరిట 6 కోట్ల రూపాయల వ్యయం అవుతోందని తెలుస్తోంది. ఇలా లెక్క వేస్తే 18 శాసనసభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ఖర్చు 300 కోట్ల రూపాయలు దాటేస్తున్నది.
ఒక ఓటుకు అతి తక్కువగా 200 రూపాయలు, పది ఓట్లను కలిగిన ఓ చోటా నేత ఓటుకు నాలుగువేల రూపాయలు వెలకట్టారు. అలానే ఓటుకు వెయ్యి రూపాయలు, చోటా నేతకు పదివేల రూపాయలు కూడా ఖర్చు పెట్టేందుకు వెనుకాడలేదు. ఈ 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇదే తరహాలో ఓటుకు విలువ కట్టేశారు. అయితే ఒక వెనుకబడిన (రాయదుర్గం తరహా) నియోజకవర్గంలో అభ్యర్థులు తక్కువే ఓట్లున్నా అతి తక్కువగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇలా ఖర్చు చేయటంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కన్నా పోలీసులకు ఎక్కువగా దొరికింది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కావటం గమనార్హం. మొదట్లో ప్రచారం చేసినట్లే ఈ పార్టీ తరుపున ఎన్నికల అక్రమాలకు కార్యకర్తలు తెగబడుతున్నారు. పైగా మంచినీళ్ల ప్రాయంలా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రెండు కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా గతంలో పోల్చుకుంటే మద్యం పంపిణీ ఎక్కువయింది. ఎన్నికలు లేని నియోజకవర్గాల నుంచి చీప్ లిక్కర్ ను కేసులకు కేసులు తరలించేస్తున్నారు. హోల్ సేల్ గా దీన్ని కొని అడిగిన వారికల్లా పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకించి ఎస్సీకాలనీల్లోనూ, వెనుకబడిన ప్రాంతాల్లోనూ చీప్ లిక్కర్ ఓటర్లను ప్రభావితం చేస్తోంది. అభ్యర్థులు ఇంత భారీ ఖర్చు చేయటం ఇదే ప్రథమమని ఎన్నికల పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఓటర్లల్లో చైతన్యం వస్తే మారుతుందనుకుంటే వెనుకబడిన ప్రాంత ఓటర్లలో ప్రలోభాలు పెరిగాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ ప్రలోభాల ఎర నుంచి ఓటరును బయటికి తీసుకురావటం చట్టపరంగా కష్టమంటున్నారు.


