TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉప ఎన్నికల వ్యయం రూ. 200కోట్లా?

Published on: Wed Jun 6, 2012 1:37PM

రాష్ట్రంలో అత్యంత ఖరీదైన ఉప ఎన్నికలు జూన్ 12న జగరనున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటి వరకూ అందిన అంచనాల ప్రకారం దాదాపుగా రూ.200కోట్లు ఈ ఎన్నికల్లో ఖర్చు అవుతోంది. ఇసి ఎంత అదుపు చేసినా డబ్బు ప్రవాహ పెరిగిందని సమాచారం. గతంలో ఓటుకు వంద, యాభై ఇచ్చేవారు. ఇప్పుడు అది కాస్తా వెయ్యి, బాగా ఖరీదైన ఓట్లయితే ఐదువేలు కూడా అవుతోంది. అభ్యర్థులు ఈ ఖర్చుకు వెనుకాడటం లేదని తెలుస్తోంది. అన్ని ప్రధానపార్టీలూ ఓట్ల కొనుగోలు దందాలో పాలు పంచుకుంటున్నాయని తెలుస్తోంది. ఎక్కడైతే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలంగా ఉన్నారో ఆ నియోజకవర్గంలో కనీసం పది కోట్ల రూపాయలు ఇతర పార్టీలు ఖర్చు చేస్తున్నాయట. ఈ విధంగా రాష్ట్రంలోని 18అసెంబ్లీ నియోజకవర్గాల్లో 180కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఒక్క పార్లమెంటు నియోజకవర్గం నుంచి మాత్రం 20కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందని తెలుస్తోంది. పోలీసులు ఇప్పటి దాకా 27కోట్ల పైచికలు లెక్కలో రాని డబ్బు స్వాదీన పర్చుకున్నారు.



ఒకవైపు పోలీసులనూ, ఆదాయపన్ను శాఖను చెక్ పోస్టుల్లో ఈ నల్లధనం వైపు దృష్టి సారించేలా చేసి మరో మార్గంలో పార్టీలు డబ్బు తెప్పించుకున్నాయని తెలుస్తోంది. ఇలా రహస్యమార్గంలో ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోయాక మిగిలిన పార్టీల వారి డబ్బు గురించి పోలీసులకు అభ్యర్థులే నేరుగా ఫిర్యాదు చేసి మరీ పట్టిస్తున్నారట. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రాజకీయపార్టీలు ఒకరిపై ఒకరు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ డబ్బుతో విజయానికి దారీ చేసుకుంటున్నారట. 60శాతం పార్టీల సహకారంతోనూ, 40శాతం సొంతడబ్బుతోనూ ఈ ఎన్నికలను అభ్యర్థులు ఎదుర్కొంటున్నారట. వై.కా.పా. అభ్యర్థులకు క్రిష్టియన్ ఓటు బ్యాంకు ఏర్పడిందీ మిషనరీల డబ్బుతోనే అన్న విషయం పాఠకులకు తెలిసిందే. కాంగ్రెస్, టిడిపి, వై.కా.పా., బిజెపి, టిఆర్ ఎస్ వంటి పార్టీలన్నింటిపైనా ఈ డబ్బు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ భన్వర్ లాల్ మాత్రం తమ యంత్రాంగం పటిష్టంగా ఉన్నందున ఓట్ల కొనుగోలు అసాధ్యమని అంటున్నారు. ఇదెంత వరకూ నిజమో భవిష్యత్తులోనే తేలుతుంది.