TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కడప జిల్లాలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ విజయం తథ్యమా?

Published on: Fri Jun 15, 2012 8:27AM

కడపజిల్లాలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని పరిశీలకులు తేల్చేస్తున్నారు. ఈ జిల్లాలో జరిగిన ఉపఎన్నికల్లో రాయచోటి, రాజంపేటరైల్వేకోడూరు నియోజకవర్గాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ గ్రామాలే అండగా నిలిచాయి. ఎన్ని పార్టీలు జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసినా వాటన్నిటినీ ఈ మూడు నియోజకవర్గాల ఓటర్లు తోసిరాజన్నారు. దీనికి అసలు కారణమేమిటని పరిశీలిస్తే ప్రాంతీయత, జగన్ పై సానుభూతి అని తేలాయి. సిబీఐ జగన్ ను అరెస్టు చేశాక ఘాటైన విమర్శలతో ఈ మూడు నియోజకవర్గాలనూ కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు వేడెక్కించాయి. అయినా ఆ విమర్శలకు స్పందించినట్లు కనిపించని ఓటరు చివరికి ప్రాంతీయతకు లొంగాడు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తన ప్రచారంలో అన్ని పార్టీలూ ఒక్కటై మన జగన్ ను విమర్శలతో చుట్టుముట్టాయని ఆందోళనగా చెప్పిన మాటలు ఓటరు మనస్సు మార్చాయి. రాయచోటి నియోజకవర్గంలో రామాపురం, గాలివేడు, లక్కిరెడ్డిపల్లి, చిన్నమండెం, సంచెపల్లి గ్రామాలు పూర్తిగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుచూపాయి. అలానే రాజంపేట నియోజకవర్గంలో సిద్ధవటం, మాధవపురం, వీరబల్లి, ఒంటిమిట్ట, నందలూరు గ్రామాలు మొదటినుంచి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. క్షత్రియ, మైనార్టీలు ఈ నియోజకవర్గంలో జగన్ పార్టీకి అండగా నిలిచారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో చిట్యేలి, పెనగలూరు, ఓబులావారిపల్లి, కోడూరు ప్రాంతాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వెనుకనే గ్రామస్తులు నడిచారు. అసలు ఆ పార్టీకి స్పందించిన తీరు చూస్తే విజయం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకే అని చెప్పకుండానే అర్థమైంది. ఏదేమైనా తన సొంతగూటిలో జగన్ బలమైన పార్టీగా పాతుకుపోయారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అధికారికంగా ఫలితాలు వెలువరించడమే తరువాయి కానీ, జగన్ పార్టీ తరువాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.