జగన్ కి విషమ పరీక్ష....బాబు కన్నా ఎక్కువ అప్పుల తిప్పలు ?

 

గత ఎన్నికల్లో హోరాహోరీ పోరాడిన వైసీపీ ప్రభుత్వం నిన్న తొలి పద్దును ప్రవేశపెట్టింది. దాదాపు రూ.2.28 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై జగన్ మార్క్ స్పష్టంగా కనిపించింది. ఎన్నికల్లో తాము గెలవడానికి ఎంతో దోహదపడిన మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల అమలు కోసం బడ్జెట్ లో భారీ ఎత్తున నిధులు కేటాయించారు. 

అయితే ఈ కేటాయింపుల్లో ఎక్కువ మొత్తం సంక్షేమ పదకాలకే కేటాయించిన నేపధ్యంలో ముందుకుముందే విమర్శలు రాకుండా తమకి ఒక విజన్‌ ఉందని, రాబోయే కాలంలో తమ విజన్ తో  దేశంలోనే ఎపీను ప్రథమ స్థానంలో నిలుపుతామని బడ్జెట్ సందర్భంగా బుగ్గన వ్యాఖ్యానించారు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే సంక్షేమ పథకాల కోసం రూ.90 వేల కోట్లు కేటాయించిన తరుణంలో ప్రభుత్వానికి విజన్ ఎంతో అవసరం. 

పూర్తి బడ్జెట్ రూ.2,27,974 కోట్లు కాగా ఆదాయ వనరులేమో రూ.1,78,697 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఏపీకి పన్నుల రూపేణా 75,437 కోట్లు సమకూరుతాయని సర్కారు భావిస్తుండగా కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో రూ.34,833 కోట్లు, పన్నేతర ఆదాయంగా రూ.7354 కోట్లు, రుణ వసూళ్ల ద్వారా రూ.600 కోట్లు ఖజనాకు చేరతాయని భావిస్తోంది. మరోపక్క రెవెన్యూ లోటు రూ.1778.52 కోట్లు ఉండగా ద్రవ్యలోటు సుమారు రూ.35,260.58 కోట్లుగా ఉంది. 

ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసే సహాయం మీదనే ఏపీ సర్కారు భారీ ఆశలు పెట్టుకుంది. కేంద్ర నుంచి నిధుల రూపంలో రూ.61,071 కోట్లు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. గతంలో చంద్రబాబు కేంద్రం నుంచి రూ.50 వేల కోట్ల సాయాన్ని ఆశిస్తే వారిచ్చినది రూ.19 వేల కోట్లే. అంటే డిమాండ్ కి సప్ప్లై కి మధ్య ఉన్న తేడా రూ.30 వేల కోట్లు. ప్రస్తుతానికి వైసీపీ బీజేపీ మధ్య సఖ్యత ఉన్నా అడిగినంత నిధులిచ్చేంత అవసరమైతే మోడీకి లేదు. 

దీంతో ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పడక తప్పదేమో ? గత ఏడాది బడ్జెట్ కంటే ఈ ఏడాది బడ్జెట్ అంచనా 19.32 శాతం పెరుగుతుందని వైసీపీ నిన్న ప్రకటించింది. కానీ ఆ అంచనాలు ఎంత మేర నిజమవుతాయో చెప్పలేం. వారి అంచనా మేరకు పెరగకపోతే జగన్ సర్కారుకు చిక్కులు తప్పవు. ఎందుకంటే గత 2018-19 బడ్జెట్లో బాబు సర్కారు అంచనాల కంటే తక్కువగా ఆదాయం సమకూరింది. 

ఆ వ్యత్యాసం ఎంత అంటే రూ.35 వేల కోట్లకుపైగా. దీంతో అప్పుడు రూ.33,461 కోట్ల మేర అప్పులు తెస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు రూ.38 వేల కోట్ల మేర రుణాలు తెచ్చింది. ప్రస్తుత బడ్జెట్లో అదే పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తపడాలి. ఇక రుణాల రూపంలో రూ.46,921 కోట్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 2018-19 నాటికి రాష్ట్రానికి రూ.2.58 లక్షల కోట్ల రుణాలు ఉన్నాయని నిన్న బుగ్గన స్పష్టం చేశారు. 

అయితే గత ఆర్థిక సంవత్సరంలో టీడీపీ సర్కార్ ఎడాపెడా అప్పులు చేస్తోందని ఆరోపించిన వైసీపీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ అప్పులు తేవాల్సిన దుస్థితి. జగన్ సమర్ధతకి ఆది పెద్ద పరీస్ఖ అనే చెప్పాలి. నిజానికి పాలనలో అనుభవం ఉన్న చంద్రబాబుకే సాధ్యం కానిది, యువకుడిని అని చెబుతున్న జగన్ ఏమి చేయనున్నారో ? చూడాలి మరి.