మైండ్ గేమ్ మొదలెట్టిన ఏపీ బీజేపీ !

 

తెలుగు రాష్ట్రాల్లో జెండా పాతాలని చూస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. తెలంగాణాలో కొంత మేర పుంజుకుని నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ, ఇప్పుడు ఏపీ మీద పూర్తిగా ఫోకస్ చేసినట్టుంది. ఏపీలో ఏమీ చేయకుండానే పక్క పార్టీ నుండి ఒకేసారి నలుగురు రాజ్యసభ ఎంపీలని పార్టీలో చేర్చుకుంది. ఇక అలాగే రాజకీయ నిరుద్యోగులను, పక్క పార్టీలలో పదవులు లేక, రాక స్తబ్దుగా ఉన్న నేతలను లాక్కునే పనిలో పడింది. 

అయితే ఇలాంటి స్టాక్ ఏమి చేసుకోవాలో అర్ధం కాలేదు కామోసు ఇప్పుడు ఇప్పుడు అధికార పార్టీని కూడా టార్గెట్ చేసిందని ఆ పార్టీ నాయకుల వ్యాఖ్యలను బట్టి అర్ధం అవుతోంది. టిడిపీకి చెందిన పలువురు నాయకులు, ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తాము ఓకే అని చెప్పిన వెంటనే వారు బీజేపీలో చేరిపోతారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నా అలాంటి అవకాశాలు ఏవీ కనపడం లేదు. దీంతో ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేశారని చెబుతున్నారు. 

వైకాపా అధికారంలోకి వచ్చి ఇంకా రెండు నెలలు కూడా కాక ముందే ఆ పార్టీలో ఇబ్బందిగా ఫీల్ అవుతున్న వారు ఉండడంతో వారిని ముందుగా వలవేసే పనిలో పడిందని అంటున్నారు విశ్లేషకులు.  రెండ్రోజుల క్రితం ఆ పార్టీ మహిళ నేత తోట వాణి బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. ఆమె విషయం ఏమీ తేలకుండానే తాజాగా జగన్‌ క్యాబినెట్‌ లోని సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ తమ పార్టీ అధికారంలోకి రాకుంటే బీజేపీలో చేరతామన్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆయనే కాక మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌ కూడా తమతో ఎన్నికలకు ముందు టచ్‌లో ఉన్నారని, వీరిద్దరూ అప్పుడు వైకాపాను వీడి బీజేపీలో చేరాలని చూశారని కానీ ఇద్దరికే జగన్ టిక్కెట్లు ఇవ్వడంతో అప్పుడు ఆగారని  చెబుతున్నారు. అయితే ఇదంతా మైండ్ గేమ్ అని అంటున్నరు విశ్లేషకులు. చూడాలి మరి బీజేపీ మైండ్ గేమ్ ఎంతవరకూ సఫలం అవుతుందో ?