ఏపీలో రక్షణ లేదని..ఏపీ పోలీసులనే రక్షణ కోరారు

 

ఏపీ బీజేపీ నేతలు తమకు రక్షణ కల్పించాలని పోలీసు శాఖను ఆశ్రయించారు. తాజాగా డీజీపీ కార్యాలయానికి వచ్చిన బీజేపీ నేతలు.. డీజీపీతో పాటు ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో అక్కడి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల కాలంలో తమ పార్టీ నేతలపై దాడులు జరగడంతో బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు ఏపీలో రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. బీజేపీ నాయకులకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ మహిళపై బెదిరింపులకు పాల్పడటం దారుణమని అన్నారు. ఆయన వెంటనే బైండోవర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపారు. టీడీపీ రౌడీలు విజయవాడ నుంచి గుంటూరు వెళ్లి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాకినాడలో బీజేపీ నేతలు చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్నప్పుడు వారిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ అయన చేసిన వ్యాఖ్యలు, మరుసటి రోజు కన్నా ఇంటి ఎదుట టీడీపీ శ్రేణులు ధర్నాకి దిగటం రాజకీయంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.