ఏపీ అసెంబ్లీ ఇదే..దీనిలో ప్రత్యేకతలు..

 

ఏపీ రాజధాని అమరావతిలో అసెంబ్లీ నిర్మాణానికి పలు డిజైన్లును రూపొందించిన నేపథ్యంలో ఎట్టకేలకు ఒక డిజైన్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి అసెంబ్లీకి సంబంధించి ఓ వీడియో విడుదల చేయగా...దానికే అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు అసెంబ్లీ డిజైన్ కూడా దాదాపు అందిరికీ నచ్చేసింది. ఈరోజు  విజయవాడలోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో శాసనసభ, హైకోర్టు ఆకృతులను పరిశీలించారు. గతంలో ప్రభుత్వం సూచించిన మార్పుచేర్పుల గురించి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించినట్టు తెలుస్తోంది. 1350 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా నగర ప్రణాళికలను ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసింది. ఇప్పుడు అందులో పార్కులు, రహదారుల ప్రణాళికలో స్వల్ప మార్పులు చేశారు. శాసనసభ, సచివాలయం, ప్రభుత్వాధికారుల కార్యాలయాలన్నీ ఈ బ్లాక్‌లోకే వస్తాయి. గతంలో శాసనసభ భవనాన్ని ప్రత్యేకంగా ఈ బ్లాక్‌ చివరన కేటాయించారు. ఇప్పుడు దానిని బ్లాక్ మధ్యలోకి తీసుకొచ్చారు. బ్లాక్ మొత్తం 250 ఎకరాలు కాగా, అందులో 120 ఎకరాల్లో ఓ తటాకంలా ఏర్పాటు చేసి, దాని మధ్యలో శాసనసభ భవనాన్ని టవర్ ఆకృతిలో నిర్మించనున్నారు.

 

ఇంకా దీని ప్రత్యేకతలు ఏంటంటే...

 

* తటాకంలో భవనం ప్రతిబింబంలా కనిపిస్తుంది
* ఈ భవనం ఎత్తు 250 మీటర్లు కాగా, 40 మీటర్ల వరకు పైకి వెళ్లి నగరాన్ని వీక్షించవచ్చు.
* మొత్తం నాలుగు విభాగాలుగా ఉంటుంది. శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలు, సెంట్రల్ హాల్, పరిపాలనా భవనం తదితర విభాగాలుంటాయి.

 

ఇక “టవర్ ఆకృతి”నే ఫైనల్ చేసిన ప్రభుత్వం మంత్రివర్గంతో చర్చించిన అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అంతేకాదు.. దీనిపై ప్రజాభిప్రాయం కోరగా... 68 శాతం మంది ఈ టవర్ ఆక్సతినే ఓకే చేసినట్టు తెలుస్తోంది. మరి ఫైనల్ గా ఏం డిసైడ్ చేస్తారో చూడాలి.